Home వివాదం - వాస్తవం ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి రంగం-పోలవరం పరిమితులు

ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి రంగం-పోలవరం పరిమితులు

62
0
default

బొజ్జా దశరథరామి రెడ్డి

గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడికాలువ ద్వారా 80 టిఎంసీలు కృష్ణా డెల్టాకు,  220 టిఎంసీలు  గోదావరి జిల్లాలకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు  అందించే లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల  కృష్ణా జలాలకు బదులుగా గోదావరి జలాలను  కృష్ణా డెల్టా వినియోగించుకోవడం వలన  80 టిఎంసీల  కృష్ణా జలాలు ఆదా అవుతాయి. ఈ  80 టీఎంసీల కృష్ణా జలాలను శ్రీశైలం రిజర్వాయర్‌ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు వినియోగించే అవకాశం వస్తుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు ఉపయోగపడే లక్ష్యంతో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టారు. అందువల్ల ఈ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుందని పోలవరం కుడి కాలువను తాత్కాలిక ప్రాజెక్టుగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని   2016లో చేపట్టారు.  ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును  ఒక సంవత్సర కాలంలో అంటే..  2017 సంవత్సరానికి  పూర్తి చేశారు. పోలవరం కుడి కాలువ వలన కలిగే ప్రయోజనాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పొందవచ్చును. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టా పొందడం వలన, ఆదా అయ్యే కృష్ణా జలాలను రాయలసీమ ప్రాజెక్టులు వినియోగించుకొనే అవకాశం ఉంది. 

ఈ కారణం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాలు ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి రంగ  అభివృద్ధికి కీలకం అన్న భావన కలిగిస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు, లభిస్తున్న ఆధారాలను పరిశీలిస్తే పోలవరం ప్రాజెక్టు పలితాలు అనేక పరిమితులకు లోబడి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తున్నది.

                1. పట్టిసీమ నిర్మాణం ద్వారా ఆదా అయన కృష్ణా జలాలను రాయలసీమకు వినియోగించాలంటే శ్రీశైలం రిజర్వాయర్‌ నిర్వహణ ఆత్యంత కీలకం. పట్టిసీమ నిర్మాణం పూర్తయి ఏడు సంవత్సరాలయినప్పటికీ శ్రీశైలం రిజర్వాయర్‌ నిర్వహణపై పాలకులు దృష్టి పెట్టలేదు. పైగా శ్రీశైలం రిజర్వాయర్‌ నిర్వహణ విధివిధానాలను పాటించకపోవడం వలన రాయలసీమ తీవ్రంగా నష్టపోతున్నది.

                2. కృష్ణా డెల్టాకు కేటాయించిన 181.2 టిఎంసీల కృష్ణా జలాల్లో  80 టిఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్‌ నుండి నాగార్జునసాగర్‌ ద్వారా ఆ ప్రాంతం తీసుకుంటున్నది.  మిగిలిన 101.2 టిఎంసిల నీటిని నాగార్జునసాగర్‌ దిగువన, ప్రకాశం బ్యారేజికి ఎగువన కృష్ణా నదిలోకి తెలంగాణ నుండి ప్రవహించే మూసి, పాలేరు, మున్నేరు తదితర  నదులు అందిస్తున్నాయి. ఆ నదుల  నుండి కృష్ణా డెల్టా ఈ  నీటిని పొందుతున్నది. ఈ మేరకు బచావత్‌ ట్రిబ్యునల్‌  ఈ నదుల నుండి నీరు కేటాయించి  కృష్ణా డెల్టాకు హక్కులు కల్పించింది. అయితే నాగార్జున సాగర్‌, ప్రకాశం బ్యారేజి మధ్యన కేవలం 20 టిఎంసీల నీటిని కృష్ణా డెల్టా వినియోగించుకుంటున్నదని  కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ 18,19 జూన్‌  2015న డిల్లీలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనింది. (నాగార్జునసాగర్‌ దిగువన 45 టిఎంసిల నీటి నిర్వహణ సామర్ధ్యం ఉన్న పులిచింతల నిర్మాణం జరిగినప్పటికి కూడా కేవలం 20 టిఎంసీల నీటి వినియోగానికి  మాత్రమే ఆస్కారం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమావేశంలో పేర్కొనడం గమనార్హం) కృష్ణా డెల్టాకు హక్కుగా ఉన్న కృష్ణా జలాలను పొందలేని నీటికి  బదులుగా నాగార్జునసాగర్‌ ద్వారా ఇవ్వాలని ఈ సమావేశంలో తీర్మానం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించింది. అంటే కృష్ణా డెల్టాకు మూసి, పాలేరు, మున్నేరు నదుల ద్వారా  కేటాయించిన 101.2 టిఎంసీల నీటిలో   కేవలం 20 టిఎంసీల మాత్రమే  ఆ ప్రాంతం వినియోగించుకుంటున్నది.  హక్కుగా ఉన్న  కృష్ణా జలాలను సమగ్రంగా వినియోగించుకోడానికి కావాల్సిన రిజర్వాయర్ల నిర్మాణాన్ని విస్మరించారు. అందువలన కృష్ణా డెల్టాకు హక్కుగా ఉన్న కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్నాయి. ఈ నీటికి బదులుగా రాయలసీమ లేదా నాగార్జునసాగర్‌ వాడుకోవల్సిన కృష్ణా జలాలను కృష్ణా డెల్టాకు ఇవ్వాలని  తీర్మానాలు చేసారు.

                3. సరైన రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు, పంట కాలువలు లేకపోవడం వలన రాయలసీమకు హక్కుగా ఉన్న తుంగభద్ర జలాలు శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుతున్నాయి. అయితే శ్రీశైలం రిజర్వాయర్‌ నిర్వహణను చట్టబద్ధమైన విధివిధానాల మేరకు చేపట్టకపోవడం వలన,  హక్కుగా ఉన్న నీటిని కూడా పోతిరెడ్డిపాడు ద్వారా లేదా హంద్రీనీవా ఎత్తిపోతల ద్వారా రాయలసీమ పొందలేక పోతున్నది.

                4. మూసి, పాలేరు, మున్నేరు ద్వారా కృష్ణా డెల్టా హక్కుగా తీసుకోవాల్సిన కృష్ణా జలాలను నిలువ చేసుకునే రిజర్వాయర్లు నిర్మించకపోవడం వలన కృష్ణా జలాల సముద్రం పాలవుతున్నాయి. ఈ నష్టాన్ని  శ్రీశైలం జలాశయం ద్వారా తీర్చుకోవాలని అనుకోవడం వల్ల  శ్రీశైలం రిజర్వాయర్‌ మీద ఒత్తిడి పెరిగింది. కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడానికి శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టం 854 అడుగుల నుండి 834 అడుగులకు తగ్గించారు. ఫలితంగా  రాయలసీమకు చట్టబద్ధంగా ఉన్న  నీటి హక్కులను వినియోగించుకోలేకపోతున్నది. వ్యవసాయం దెబ్బతిని వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. కరువు కాటకాలతో వేల గ్రామాలు వలస వెళ్లవలసిన దుస్థితి ఏర్పడిరది.   సంపద సృష్టించడంలో వెనుకబడిపోయింది.

    5. పోలవరం కుడి కాలువ నుంచి  గోదావరి జలాలను కృష్ణా డెల్టా వాడుకోవడం ద్వారా ఆదా అయ్యే  80 టిఎంసీల కృష్ణా జలాలను పూర్తిగా రాయలసీమ వినియోగించుకునే పరిస్థితి లేకుండాపోయింది. గతంలో బచావత్‌  ట్రిబ్యునల్‌ నిర్ణయించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తే ఆదా అయ్యే కృష్ణా జలాలలో 35 టిఎంసిలు కర్నాటక, మహారాష్ట్ర లకు ఇవ్వాలి. అంటే ఆదా అయ్యే కృష్ణా జలాలలో రాయలసీమ వినియోగించుకోవడానికి అవకాశం ఉన్నది కేవలం 45 టిఎంసిలు మాత్రమే.   ఆ నీరు అయినా  రాయలసీమకు అందే  అవకాశం లేకుండాపోయింది.  ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా డెల్టా ఆధునికీకరణ వలన ఆదా అయ్యే కృష్ణా జలాలలో 20 టిఎంసిలను శ్రీశైలం రిజర్వాయర్‌కు, జూరాల ప్రాజెక్టుకు, ఎగువన తెలంగాణలో ఉన్న  భీమా ప్రాజెక్టుకు కేటాయించారు. అంటే పోలవలం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలు శ్రీశైలం రిజర్వాయర్‌లో నిలువ కాకముందే   20 టిఎంసిలను  భీమా ప్రాజెక్టు వినియోగించుకుంటుంది.  ఇక  రాయలసీమ నికరంగా వాడుకునే అవకాశం ఉన్న కృష్ణా జలాలు కేవలం 25 టిఎంసిలు మాత్రమే.

       6. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్‌ దిగువన హక్కుగా ఉన్న కృష్ణా జలాలను వినియోగించుకొనే మార్గం చేపట్టకుండా కేవలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సాగు నీటి సమస్యలు పరిష్కారమవుతాయని ముందుకు పోవడం సరైంది కాదు. ఈ పద్ధతిలో రాష్ట్ర సాగునీటి రంగ సమస్యకు పరిష్కారం దొరకదు. తనకు హక్కుగా ఉన్న నీటిని కృష్ణా డెల్టా విస్మరించి, పోలవరం ప్రాజెక్టును నిర్మించినా  హక్కుగా ఉన్న కృష్ణా జలాలు సముద్రం పాలవుతూనే ఉంటాయి. ఆ నీటికి బదులుగా రాయలసీమకు అందాల్సిన నీటినైనా,   నాగార్జునసాగర్‌ వినియోగించుకోవల్సిన నీటినైనా,  లేదా పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర, గోదావరాంధ్ర తీసుకోవాల్సిన నీటినైనా  కృష్ణా డెల్టా సొంతం చేసుకొనే ప్రమాదం ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ విధానం పోలవరం ప్రాజెక్టు పూర్తియినా మారదు.  ఏదో ఒక ప్రాంత సాగునీటి హక్కులకు విఘాతం కలుగుతూనే ఉంటుంది. కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోనే ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి రంగం అంతా అభివృద్ధి అవుతుందని ప్రభుత్వాలు చెబుతున్న మాట నిజం కాదు.  ఈ ప్రాజెక్టు పూర్తయినా కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల సాగునీటి సమస్య అట్లాగే ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కాదు.

                7. ఈ వాస్తవాల నుంచి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాగునీటి రంగ అభివృద్ధిని పోలవరం ప్రాజెక్టుతో ముడిపెట్టడానికి వీల్లేదు. అయితే ప్రభుత్వం పోలవరం కడితే అన్ని ప్రాంతాల సమస్యలు పరిష్కారమవుతాయని అత్యధిక నిధులను ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవాంతరాలను అధిగమించడానికి ప్రత్యేక దృష్టితో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. పోలవరం మీద ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను   ప్రశ్నించడం లేదు. కానీ  వెనుకబడిన ప్రాంతాల సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టడానికి చేపట్టాల్సిన క్యారీ ఓవర్‌ రిజర్వాయర్ల, ప్రధాన కాలువలు, పంట కాలువలు, చెరువుల నిర్మాణం, ప్రాజెక్టుల గేట్లు, ఎత్తిపోతల పథకాల కేబుల్స్‌/మోటర్లు,  కాలువ గట్లు,  రిజర్వాయర్ల బండ్‌, చెరువుల మరమ్మత్తులు తదితర మౌలిక వసతుల నిర్వహణపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది. వీటితోపాటు శ్రీశైలం ప్లంజ్‌ పూల్‌ మరమ్మత్తు పనులను  నిధుల లేవని పక్కన పెడుతున్నది.  దీనితో వెనుకబడిన ప్రాంతాల సాగునీటి రంగ పరిస్థితి  ఏటా  దిగజారి పోతున్నది. ఇలాంటి   విధానం సంపద సృష్టితో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి  ఏమాత్రం వాంఛనీయం కాదు.

                8. బచావత్‌ ట్రిబ్యునల్‌ 75 శాతం సంవత్సరాలలో తప్పక లభించే నీటిని లెక్కించి పంపిణీ చేసింది.  అంటే 25 శాతం సంవత్సరాలలో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నీటి కొరత తప్పక అనుభవించాలి. ఆంధ్రప్రదేశ్‌లో దిగువన ఉన్న కృష్ణా డెల్టా  కూడా వంద సంవత్సరాలలో ఇరవై ఐదు ఏళ్ళు సాగు నీటికి ఇబ్బంది పడాలి. కానీ కృష్ణా నదికి ఎగువన ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు హక్కుగా ఉన్న నీటిని వినియోగించుకొనడానికి కావలసిన జలాశయాలను నిర్మించకపోవడం వల్ల    ఆ నీరంతా దిగువకు ప్రవహిస్తున్నది. తక్కువ నీరు లభించే 25 సంవత్సరాల్లో కూడా  కృష్ణా డెల్టా ప్రాంతం సాగునీటికి ఇబ్బంది పడటం లేదు. తక్కువ నీరు లభించే  25 సంవత్సరాలలో కూడా కృష్ణా డెల్టా సాగునీటికి ఇబ్బంది పడకపోవటం మంచిదే. అయితే రాయలసీమ ఏ సంవత్సరంలో కూడా తన నీటి హక్కులను వినియోగించుకొనలేక పోతున్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే నీరు సంవృద్ధిగా లభిస్తున్న 75 శాతం సంవత్సరాలలో కూడా  రాయలసీమలో ఆ నీటిని వాడుకోడానికి  నిర్మాణాలు లేకపోవడంతో, ఆ నీరంతా సముద్రంపాలు అవుతున్నది. విలువైన ప్రకృతి సంపదను సముద్రంపాలు చేసి, రాయలసీమను సంపద సృష్టికి దూరం చెయ్యడం ఏ మాత్రం వాంఛనీయం కాదు. మానవత్వం అసలే కాదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాగునీటి రంగ అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే ప్రధానం అనే ప్రభుత్వం ప్రచారానికి పూర్తి భిన్నమైన వాస్తవాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానం వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. అందువల్ల    ఒక విస్తృత కమిటీని ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాగునీటి  రంగం అభివృద్ధికి సాంకేతిక నైపుణ్యం గలిగిన వారితో పాటు విశాల హృదయం, సమభావన, విస్తృత పరిజ్ఞానం గల సభ్యులతో ఒక కమిటీి ఏర్పాటు చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆశిస్తున్నది.