రాయలసీమ విద్యావంతుల వేదిక నాలుగో రాష్ట్ర మహాసభను సెప్టెంబర్ 29 ఆదివారం ప్రొద్దుటూరులో తలపెట్టాం. ఈ సందర్భంగా “విభజన అనంతర రాయలసీమ” అనే అంశాన్ని చర్చనీయాంశం చేయదలిచాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరైపోతున్న తరుణంలో రాయలసీమ సమస్యలపై పోరాడటానికి అమరులు డా. మాధవస్వామి, డా. కృష్ణమూర్తి నాయకత్వంలో వేదిక ఏర్పడిన విషయం మీకు తెలిసిందే. సుమారు నూరేళ్లుగా సాగుతున్న రాయలసీమ ప్రాంతీయ ఆకాంక్షలు ప్రత్యేక రాష్ట్రంలోనే సాకారం కాగలవనే రాజకీయ అవగాహనతో వేదిక పని చేస్తున్నది.
రాష్ట్ర విభజన సందర్భంలో తలెత్తిన సమైక్య ఉద్యమానికి ఎదురీది సీమ ప్రాంతీయ సమస్యలను ముందుకు తేవడంలో మిగతా రాయలసీమ సంస్థలతో, మేధావులతో విద్యావంతుల వేదిక కలిసి పని చేసింది. పదేళ్లుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నీటిపారుదల,
పారిశ్రామిక, విద్యా, ఉపాధిరంగాల్లో రాయలసీమకు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా తన వంతు నిరసన తెలియజేస్తున్నది. సమస్యలను ప్రజల్లోకి తీసికెళుతున్నది. రాయలసీమ పోరాటాల్లో పాలుపంచుకుంటున్నది. కోస్తా పాలకవర్గం, స్థానిక పాలకవర్గం చేతిలో
వంచనకు గురవుతున్న రాయలసీమ ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా వేదిక తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ప్రాంతాల సమానత్వం, సమాన అభివృద్ధి, అవకాశాలు అనే ప్రజాస్వామిక విలువలు ప్రాతిపదిక మీద విద్యావంతుల వేదిక పని చేస్తున్నది. ప్రభుత్వ
విధానాల్లో, సామాజిక జీవనంలో సమానత్వ భావన, ప్రజాస్వామిక సంస్కృతి నెలకొన్నప్పుడే రాయలసీమ మానవీయ సమాజంగా ఎదుగుతుందని అవగాహనతో వేదిక తన శక్తిమేరకు కృషి చేస్తున్నది.
విభజన చట్టం రాయలసీమకు నిర్దిష్టంగా ఇచ్చిన హామీలు ఇంత వరకు అమలులోకి రాలేదు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు ఈ హామీల విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈ పదేళ్లలో రాయలసీమ స్థితిగతులను, ఈ ప్రాంత ప్రజలు చేసిన పోరాటాలను సమీక్షించుకొని ముందుకు పోవాల్సి ఉంది. ఇందులో భాగంగా జరుగుతున్న ఈ రాష్ట్ర మహా సభలకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
కన్వీనర్ : అరుణ్
కో కన్వీనర్: విజయ్ భాస్కర్‌రెడ్డి
9 సెప్టెంబర్ 2024