1.కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి చందబ్రాబునాయుడు ఈ మధ్య కర్నూలులో హై కోర్టు బెంచ్ ఏర్పాటు జేస్తామన్నారనే ప్రకటన చేశారు. అయితే రాయల సీమ హక్కుగా రాజధాని/హైకోర్ట్ సీమ ప్రజల ఎంపిక ప్రకారం రాయలసీమలో, అదీ కర్నూల్‌లో ఏర్పాటు చేయాలి. ఇది శ్రీబాగ్ ఒప్పందపు హామీ. రాజధానిగా అమరావతిపై ఇప్పటికే మన ముఖ్యమంత్రి ఎంతో శ్రమించి వేలకోట్ల రూపాయలు విదేశీ రుణాలకై హామీ పొందారు. అందువల్ల సీమ ప్రజల ఆకాంక్షల మేరకు కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటు జేసి అన్ని ప్రాంతాల పట్ల తమ సమభావం చూపించాల్సి వుంది. అధికార కేంద్రీకరణ నియంతృత్వానికి దారి తీస్తుంది. ప్రాంతాల మధ్య అసమానాతల సృష్టించి రాష్ట్ర విభజనకు దారితీస్తుందని తెలంగాణా ఉద్యమం నేర్పిన గుణపాఠం మర్చిపోకుండా రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలి.
2. విభజన చట్టపు హామీల ప్రకారం సీమ, ఉత్తరాంధ్రా జిల్లాలకు బుందేల్‌ఖండ్ ప్యాకేజి అమలు జేయాలి. అమరావతికి, పోలవరానికి నిధులు సాధించిన ముఖ్యమంత్రి వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
3.రాయలసీమ విస్తీర్ణం రాష్ట్రంలో 44 శాతం ఉన్నందున, ముఖ్యంగా 95 లక్షల ఎకరాలు పంట భూములను కల్గి ఉన్న రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌లో 44 శాతం రాయలసీమకు కేటాయించాలి. గత పది సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి రంగానికి కేటాయించినది కేవలం 15 శాతమే. గత మూడు దశాబ్దాలకు పైగా పూర్తికాని ప్రాజెక్టులు, పూడిక జేరిన జలాశయాలు, పంట కాలువుల నిమిత్తం వెనుకబడ్డ ప్రాంతం కనుక మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేందేందుకు అదనంగా ఇంకొక 20% నిధులు కేటాయించాలి.
4, రాష్ట్రంలో రెండు ప్రాంతాలకు, దక్షిణ తెలంగాణాకు నీరందించే శ్రీశైలం జలాశయం రాయలసీమలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వున్నది. కనుక కృష్ణా నది నిర్వహణ బోర్డ్‌ను కర్నూలులోనే ఏర్పాటు చేయాలి.
5.దెబ్బతిన్న రాయలసీమ ప్రాజెక్టులను వాటి పూర్తి సామర్థ్యం మేరకు యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మించాలి. అన్నమయ్య, అలగనూరు, పందికోన, గోరుకల్లు మున్నగునవి. 1999 లో 2.96 టిఎంసిల సామర్త్యంతో నిర్మించిన అలగనూర్ రిజర్వార్ ఐదేండ్ల కిందట మట్టికట్ట కుంగడంతో ఒక చుక్క నీరు నిలవలేని పరిస్థితి ఏర్పడిరది. కడప జిల్లాకు కేసి కాలువ ద్వారా తుంగభద్ర జలాలనందించే ఈ రిజర్వాయర్ రిపేర్ కు అయ్యే ఖర్చు నాడు రూ.3 కోట్లు. ఈ అంచనా ఇప్పుడు రూ.22 కోట్లకు పెరిగింది. తెలుగుగంగ ద్వారా కర్నూల్, కడప జిల్లాలకు నీరందించే వెలుగోడు రిజర్వాయర్ (16.95టిఎంసి) రిపేర్లకు దాదాపు రూ.200 కోట్లు అవసరం. వాటిని వెంటనే విడుదల జేయాలి. 2.24 టిఎంసిల సామర్థ్యం గల అన్నమయ్య ప్రాజెక్ట్ మూడేండ్ల కిందట వరదలో కొట్టుక పోయినా దాన్ని గురించి పట్టించుకొనే దిక్కే లేదు. దాని మరమ్మతులను వెంటనే చేపట్టాలి. ఇక గోరుకల్లు రిజర్వాయర్ 12.44 టిఎంసిలు కాగా 10 టిఎంసిలకే నీరు నిలవడం కష్టంగా వుంది. గోరుకల్లు నుండి అవుకు రిజర్వాయర్ ద్వారా కడప జిల్లాకు నీటి సరఫరా కావాలి. 2008 పనులు చేపట్టినా ఇప్పటికీ రెండో సొరంగం పూర్తి కాలేదు. వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి. గండికోట నిండినా, 2లక్షల 60 వేల ఎకరాల ఆయకట్టులో పంట కాలువలు లేక ఒక ఎకరానికి చుక్క నీరందం లేదు. బ్రహ్మ సాగర్ ఆయకట్టు 1లక్ష60 వేల ఎకరాలు ఉండగా వుండగా కేవలం 40 వేల ఎకరాలకే నీరందడానికి కారణం తగిన పంట కాలువులు లేకపోవడమే. వెంటనే వాటి నిర్మాణం చేపట్టాలి.
6. ఈ సంవత్సరం వేలాది టీఎంసీల వరద జలాలు సముద్రం పాలయ్యినప్పటికి, రాయలసీమ జలాశయాలు నిండలేదు. సీమ జలాశయాల సామర్థ్యం 161.68 టిఎంసిలు కాగా,సెప్టంబర్ 10 నాటికి నిల్వ 91.45 టిఎంసిలు మాత్రమే. దానికి కారణం పోతిరెడ్డిపాడు నుంచి,(కనీసం 44 వేల క్యూసెక్కులకు తగిన సామర్థ్యంగల కాలువలు లేకపోవడమే. కనుక రాయలసీమ ప్రాజెక్టులు పూర్తిగా నింపేందుకు అవసరమైన కాలువలను నిర్మించాలి. అలాగే వివిధ ప్రాజెక్టుల ఆయకట్టు నీరందించేందుకు ముఖ్యమైన పంట కాలువలను నిర్మించాలి.
7. రాయలసీమకు వెలుగైన సిద్ధేశ్వరం అలుగును నిర్మించాలి. దీని నిర్మాణాన్ని సమర్థిస్తూ , ఆ నిర్మాణం వల సీమకు కేటాయించిన నీటిని ఆ రైతులకు తగిన సమయంలో అందించవచ్చని, శ్రీశైలం జలాశయాన్ని పూడిక నుండి కాపాడవచ్చని, సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి భూసేకరణ వుందని ముగ్గురు ఇంజనీర్స్ ఇన్ చీఫ్స్ 1996 లోనే సిఫారసు జేశారు. దానికయ్యే ఖర్చు ఆనాడు రూ.300 అని అంచనా వేయగా..నేడది రూ600 కోట్లగా మారింది. ఇంకా జాప్యం చేయకుండా వెంటనే ప్రభుత్వం సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలి.
8. కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు ముఖ్యమైన గుండ్రేవుల ప్రాజెక్ట్‌ను నిర్మించాలి. తుంగభధ్ర జలాల నిల్వకై రిజర్వాయర్లు లేక ఏటా 150 టిఎంసిలు కృష్ణలో కలుస్తున్నాయి. అవి సముద్రం పాలవుతున్నాయి. కేసి కాలువకు కేటాయించిన 39.9 టిఎంసిలను పూర్తిగా వినియోగించుకునేందుకు గుండ్రేవుల నిర్మాణం తక్షణం చేపట్టాలి.
9. కరువుకు, వలసలకు ఆలవాలమైన కర్నూల్ జిల్లా పక్షిమ ప్రాంత మండలాలకు సాగు, తాగు నీరందించే వేదవతి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి.
10. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి. కరువుపీడిత ఎమ్మిగనూర్, కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగు నీరందించాలి.
11.. అనంతపురం జిల్లా కరువు నివారణకు అలమట్టి, బుక్కపట్నం లింక్ కెనాల్ నిర్మించాలి. అంతేగాక తుంగభధ్ర జలాశయంలో పూడిక వల్ల హెచ్‌ఎల్‌సీ అనంతపురం జిల్లాకు తగిన నీరందకపోతున్నది. దాని నిర్దేశిత ఆయకట్టు 2లక్షల 85 వేల ఎకరాలు కాగా 2022-23 లో నీరందినది కేవలం 85 వేల ఎకరాలకు మాత్రమే. దానికి ప్రత్యామ్నాయంగా తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మించాలి.
12 . పెండిరగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని దానికి అదనంగా జీడిపల్లి – కుందుర్పి – బిటిపి ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలి.
13 . నచీూూ ద్వారా పిల్ల కాలువలను ఏర్పాటు చేసి హెచ్ ఎల్ సి ద్వారా 2కొత్త ఆయకట్టును స్థిరీకరించాలి. ఈ సంవత్సరం ఆధిక వర్షాలతో కృష్ణకు వరదలొచ్చినా హంద్రీ నీవా ప్రధాన కాలువ రిపేర్లు లేక 3,850 క్యూసెక్కుల సామర్థ్యమున్న కాలువ కేవలం 1685 క్యూసెక్కుల నీటి విడుదలకే గండ్లు పది నీరు పారడం లేదు. దాని సామర్థ్యాన్ని 6500 క్యూసెక్కులకు పెంచాలి. అంతేగాక ఇంతవరకు పంటకాలువలు లేవు. నిర్దేశిత ఆయకట్టు 6 లక్షల ఎకరాలు కాగా నూడు దశాబ్దాలు గడిచినా ఇప్పుడు నీరండుతున్నది కేవలం 1 లక్ష 46 వేల ఎకరాలకే. ఇక గాలేరు-నగరి ద్వారా ఒక్క ఎకరాకు నీరండడం లేదు. గాలేరు నగరి నీరును చిత్తూరు జిల్లాకు అందేలా వెంటనే చర్యలు చేపట్టాలి.
14. రాయలసీమలోని అన్ని చెరువులను పటిష్టం జేసి, వాటిని నదీ కాలువలతో అనుసంధానం చేయాలి.
15. కొప్పర్తి ఇండస్ట్రియల్ షశీతీతీఱసశీతీను తరలించ రాదు. దానిని విస్తరించాలి.
16. రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమ ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేయాలి.
17. కర్నూలును సీడ్ హబ్‌గా మార్చడానికి ఏ పి సీడ్స్, ఏ పి విత్తన ధృవీకరణ సంస్థ, వ్యవసాయ విశ్వవిద్యాలయంను కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలి. అనంతపూర్‌లో హార్టికల్చర్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు జేయాలి.
18. అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టి అనేక రాష్ట్రా స్థాయి కార్యాలయాలను రాయలసీమ నాలుగు జిల్లాలలో ఏర్పాటు చేయాలి.
19. రాష్ట్ర స్థాయి కార్యాలయాల, సెక్రటేరియట్ ఉద్యోగాలను ఫ్రీ జోన్ గా ప్రకటించి రాయలసీమ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
.20. రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తామన్న రైల్వే జోన్‌ను గుంతకల్లులో ఏర్పాటు చేయాలి.
21. రాష్ట్ర విభజన చట్టం 13 వ షెడ్యూల్‌లో పేర్కొన్న ‘సైల్’ ఆధ్వర్యంలో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. గనుల ఆధారిత పరిశ్రమలను ప్రభుత్వమే ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు జేయాలి.
22. తిరుపతి, హిందూపురంలలో ఐటీ పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయాలి.
23. రాయలసీమలో కరువులవల్ల ఎలాంటి బతుకుదెరువు మార్గాలు లేకపోవడంతో జీవనోపాధికి ఇక్కడి ముస్లిం మైనార్టీలు, దళితులు, ఇతర కులాల్లోని పేదలు అనాదిగా పొట్టకూటి కోసం కువైట్, సౌదీ లాంటి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి కట్టుబానిసలుగా దుర్భర జీవితం గడుపుతున్నారు. ఈ స్థితి మారాలంటే, సీమ పౌరులు ఆత్మగౌరవంతో, జీవన భద్రతతో తమ సొంత గడ్డమీద బతకాలంటే వారిని స్వస్థలాలకు తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి కల్పించాలి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అక్కడ దుర్భర పరిస్థితుల్లో పని చేయలేక తిరిగొచ్చి అప్పులపాలైన వారి అప్పులను ప్రభుత్వమే తీర్చాలి.
24. వరుస కరువులు కటిక దారిద్య్రం మూలంగా రాయలసీమ ప్రజల్లో కొనుగోలు శక్తి చాలా తక్కువగా ఉంటున్నది. ఇలాంటి పరిస్థితులలో సరైన ఉన్నత ప్రమాణాలు గల వైద్య సంస్థలు ఇక్కడ లేకపోవడం మూలంగా బయటి ప్రాంతాలకు వెళ్లి ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోగొట్టుకోవడం అప్పులపాలు కావడమో నిత్యకృత్యమైంది. ఈ దీనస్థితి నుండి రాయలసీమ ప్రజలకు ఉపశమనం కలగాలంటే తక్షణమే రాయలసీమలో ప్రతి జిల్లాలో అత్యున్నత ప్రమాణాలు గల వైద్య సంస్థను ఏర్పాటు చేయాలి. ఎయిమ్స్, కాన్సర్ ఇన్స్టిట్యూట్ రాయలసీమలో ఏర్పాటు చేయాలి.
25. రాయలసీమ ప్రాంత సాహిత్యం, కళలు, భాష, మాండలికం, చరిత్ర, సాంస్కృతిక అధ్యయనానికి, విస్తరణకు ఒక ప్రత్యేక పరిశోధన సంస్థను ఏర్పాటు చేయాలి.
26. రాయలసీమకు మహోన్నత సాంస్కృతిక, సాహిత్య చరిత్ర వున్నది. వాటికి ప్రతినిధులైన విద్వాన్ విశ్వం, గాడిచర్ల హరి సర్వోత్తమ రావు, పప్పూరు రామాచార్యులు, సర్దేశాయి తిరుమల రావు, గుత్తి కేశవ పిళ్ళై, వెంగమాంబ లాంటి మహోన్నతుల జీవితచరిత్రలను పాఠ్యాంశాలుగా చేర్చాలి.
27. 1857 ప్రథమ స్వాతంత్రపోరాటానికి ముందే బ్రిటీష్ వలసవాదులకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేసి అమరులైన ముతుకూర్ గౌడప్ప, గులాం రసూల్ ఖాన్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గుత్తి హంపన్నలాంటి త్యాగమూర్తులను చరిత్ర రాయలసీమది. వారి జ్ఞాపకార్థం సీమలో వారి విగ్రహస్థాపన జేయాలి. అలాంటి మహోన్నతల జీవితచరిత్రలను పాఠ్యాంశాలుగా చేర్చాలి.
28. రాయలసీమలో చారిత్రక ప్రదేశాలు పరిరక్షణ కోసం నిధులు కేటాయించి తగిన కార్యాచరణ చేయాలి.
29 . రాయలసీమ పల్లె జానపద, క్రీడల పరిరక్షణకు, ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలి.