Home ఆకాంక్షలు రాష్ట్ర  ప్రజలుగా  సీమ ప్రజలు హక్కుదారురా? అడుక్కతినేవాళ్లా?

రాష్ట్ర  ప్రజలుగా  సీమ ప్రజలు హక్కుదారురా? అడుక్కతినేవాళ్లా?

70
0

సీమ మేధావులారా, యువకులారా, విద్యార్థులారా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి   

అరుణ్‌ : (రాయలసీమ విద్యావంతుల వేదిక నాలుగో మహాసభలకు కన్వీనర్‌ నోట్‌)                                            

నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలే సకల సంపదలకు, ప్రకృతి వనరులకు వారసులు.  కాబట్టి వాటి వినియోగం ద్వారా  జరుగుతున్న ఆర్థికాభివృద్ధి ఆ ప్రజలందరికీ సమానంగా అందాలి.    ఆ వనరులను, ఆర్థికాభివృద్ధిని అన్ని ప్రాంతాలకు నిష్పక్షపాతగా పంచాలి.   ఆయా ప్రాంతాల, వివిధ వర్గాల అవసరాల కనుగుణంగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పంపిణీ జేసే ఒక వ్యవస్థ మాత్రమే ప్రభుత్వం. అంతేగాని తన అధీనంలో  వున్న వనరులను, ఉపాధి అవకాశాలను తమ కిష్టమొచ్చినట్టు పంచే అధికారం ప్రభుత్వానికి లేదు. ఇది రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం.

 ప్రభుత్వాలకు ఈ అవగాహన లోపించడంతో సామాన్య ప్రజలు, వెనుకబడిన ప్రాంతాలవాసులు చాలా ఇబ్బందిపడుతున్నారు.   దేశంలోని వనరులపైన పాలకులకు గుత్తాధిపత్యముంటుందని, వారిని ప్రాధేయపడటం ద్వారా అంతో ఇంతో లబ్ధి పొందాలనే పరిస్థితి సాధారణ ప్రజలకు తప్పడం లేదు. ఇందులో  విచిత్రమేమీ లేదు.

కానీ ఉన్నత విద్యావంతులు,  మేధావులు  పాలకుల దగ్గర దేహీ అంటూ చేయి చాచే పరిస్థితిని ప్రశ్నించాలి.  తమ కొరకే గాక మొత్తంగా నిర్లక్ష్యం చేయబడ్డ ప్రజల, వెనుకబడిన ప్రాంతాల   కోసం గొంతెత్తాల్సిన అవసరముంది. ప్రజలకు అందాల్సిన  హక్కులపై అవగాహన కల్పించి, వారిని సంఘటితపరచి, వారు సమూహంగా ఎలుగెత్తి వనరులలో (నీళ్ళు,నిధులు నియామకాలల్లో) తమ న్యాయమైన వాటాకై ఉద్యమించేలా చేసే బాధ్యత  విద్యావంతులది, మేధావులది.   ఆర్థికాభివృద్ధిలో అంతో ఇంతో వాటా పొందుతున్న  మేధావులు, విద్యావంతులు ప్రజలపై దయా దాక్షిణ్యంతోకాక తమ చదువు వెనుక, డిగ్రీల వెనుక, జ్ఞానం వెనుక, అనుభవిస్తున్న సౌకర్యాల వెనుక సామాన్యులైన  రైతు కూలీలు, పేదలు, కార్మికుల  శ్రమ ఫలితం వుందని గుర్తించాలి. వారి చెమట, రక్తం ఉందని అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రజల కోసం  గొంతెత్తడం మేధావుల, విద్యావంతుల విధి, కర్తవ్యం.  దేశంలోని, ప్రాంతంలోని  వనరులపై,  ఆ వనరుల ఆధారంగా ఉత్పత్తి అయిన సంపదపై  ప్రజలే నిజమైన హక్కుదారులు.  ఆ అభివృద్ధి అందరిదీ, అన్ని ప్రాంతాలదీ. కేవలం కొన్ని ప్రాంతాల, కొన్ని వర్గాల ప్రజల స్వంత ఆస్తి కాదు. వాటిని మనం హక్కుగా డిమాండ్‌ చేయాలి గాని, వాటి కోసం దేబరించాల్సిన అవసరం లేదు.

విద్యావంతులు, చట్టాలపై అవగాహన ఉన్నవారు   రాయలసీమ ప్రాంత న్యాయమైన హక్కుల కోసం డిమాండ్‌ జేసి సాధించుకోడానికి ఉద్యమించాల్సి ఉన్నది. దయాధర్మంతో ప్రభుత్వం ఇచ్చేవాటితో సంతృప్తి చెందక ఒక ప్రాంత హక్కుగా రాయలసీమ పోరాడి సాధించుకోవాల్సి ఉన్నది. దీనికి ఇప్పటికైనా విద్యావంతులు సిద్ధం కావాల్సి ఉన్నది. 

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలన్నీ గాలికి ఎగిరిపోతాయి. అధికారంలోకి వచ్చినవాళ్లను పదే పదే ప్రాథేయపడాల్సిందే తప్ప వాళ్లు ఇచ్చిన హామీలను అమలు చేయరు. గతంలో అసెంబ్లీ సాక్షిగా సెప్ట్టెంబర్‌ 4, 2014లో నాలుగు జిల్లాలకు చంద్రన్న ఇచ్చిన హామీల అమలు గురించి  మనమేనాడైనా ప్రశ్నించామా!

గతంలో న్యాయ రాజధాని అంటూ  జగన్‌ ఉవ్విళ్లూరించాడు.  ఆయనకు కొందరు క్షీరాభిషేకం చేశారు. అది శ్రీబాగ్‌ ఒప్పంద ద్వారా పొందిన హామీ. దాన్ని అమలు జేయడం ప్రభుత్వాల బాధ్యత అని విద్యావంతులు మర్చిపోయారు. అదేదో జగన్‌ తన స్వంత ఆస్తిలో కొంత రాయలసీమకు పంచినట్టుగా బహు సంబరపడ్డారు. ఆయన ఐదేండ్ల పాలనలో కేంద్రానికి ఆ ప్రతిపాదనే పంపలేదని తెలిశాక కూడా మౌనమేగాని నోరెత్తి మాట్లాడేలేదు. ఇప్పుడు కొత్త రాజు. ఆయన దయాదాక్షిణ్యాల పైన, కరుణా కటాక్షాలకై ఆశతో, చకోరపక్షులవలె ఎదురు చూడాల్సి వస్తున్నది.  చందబ్రాబు  మహా మేధావి. విభజన చట్టపు హామీలు, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ ఖండ్‌ నిధులు, కడప ఉక్కు కర్మాగారం, గుంతకల్‌ రైల్వే జోన్‌  గురించి కేంద్రం దగ్గర ఊసే ఎత్తలేదు. అంతెందుకు,  లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం జేస్తుంటే మాట్లాడటం లేదు. ఈ కర్మాగారం   వెనుకబడిన ఉత్తరాంధ్రకు కొంత ఆసరా. చంద్రబాబు తన ఏకైక లక్ష్యమయిన అమరావతికి, పోలవరానికి  నిధులు పొందాడు.  అమరావతి నిర్మాణమైతే రాష్ట్ర ప్రజందరికీ  ఉపాధి కలుగుతుందని, పోలవరం నిర్మాణంతో రాయలసీమ సస్యశ్యామలమవుతుందని ప్రచార ఆర్భాటంతో   మన చెవులు గింగుర్లు  తిరిగేలా  మభ్యపెడుతున్నారు.  ఇక ఆయన వందిమాగాధులైన మేధావులూ, మీడియా ఉండనే వుంది.

పోలవరం నీళ్లు మాకు అవసరం లేదు.. కృష్ణా తుంగభద్రా నీళ్ళలో మా వాట సరైన సమయంలో పొందేలా కాలువలు, రిజర్వాయర్ల రిపేరు చేపట్టిండి.. దశాబ్దాలుగా పూర్తిగాని హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేయండి.. అని  గొంతు చించుకొని అడుగుతున్నా స్పందించరు.   మూడు విడతలుగా  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు.  ఎందుకు కాలేదో, ఇక ఇప్పుడు ఏమవుతుందో ఆలోచించాలి. ఆయన అభిమానులు కొంతమంది, మొన్ననేగా ఆయన గద్దెనెక్కిందని,  అప్పుడే అన్ని డిమాండ్లు పెడితే ఎలా అని అనొచ్చు. నిజమే! జగన్‌ విషయంలోనూ అలానే అన్నారు. కానీ, రాష్ట్రానికి అందుబాటులో ఉన్న నిధుల కేటాయింపులో  ఏ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియని అమాయకులా మన పాలకులు? ఆకలితో ఉన్నవారికి కనీసం గంజిపోయడం లేదు. కడుపు నిండిన వానికే పంచ భక్ష్యపరమాన్నాలా? అమరావతికై వేలా కోట్లు కేంద్రం నుండి సాధించామని  చెప్పుకుంటున్న నాయకుడికి వెనుకబడిన జిల్లాలకు కేంద్రం  హామీ ఇచ్చిన నిధుల ఊసేత్తలేదే? అమరావతే  ఆంధ్రప్రదేశ్‌ అని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తున్నదా?

రాయలసీమ ప్రజలవి కొత్త డిమాండ్లు కాదు. ఈ ముఖ్యమంత్రికి తెలియనివి కాదు. సీమ కన్నీళ్లు, కడగండ్లు మద్రాస్‌ రాష్ట్రం నుండి విడిపోయిన కాలం నుండి ఉన్నవే. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి  జరిగిన, జరుగుతున్న అన్యాయాల సరిదిద్దుబాటు చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ దుస్థితికి  ప్రకృతి కారణం కాదని,  పదే పదే అధిక వర్షాల ద్వారా మనకు తెలుస్తోంది. రాయలసీమ వెనుకుబాటుతనం పాలకుల వైఫల్యం. ఈ ప్రాంత మేధావుల నిర్లిప్తత.

ఇలాంటి దుస్థితిలో సీమకు వచ్చిన నీటిపారుదలశాఖ  మంత్రి గారు   విజ్ఞాపనలు స్వీకరించారే గాని, ప్రాజెక్టుల నిర్మాణం గురించిగానీ, జలాశయాల రిపేర్ల గురించిగాని, చివరకు పంటకాలువుల ఏర్పాటు గురించిగానీ  ఏ హామీ ఇవ్వలేదు, నోరు విప్పలేదు.

అయితే చంద్రబాబు హైకోర్ట్‌ బెంచ్‌ ఏర్పాటుజేస్తాననే సరికి  రాయలసీమ మేధావులు, ముఖ్యంగా న్యాయవాదులు ఆనందంతో ఉప్పొంగి పోయారు. కృతజ్ఞతా భారంతో కృంగిపోయారు. ఇది టీడీపీ ప్రభుత్వం దయతలిచి ఇవ్వడం కాదని, గతంలో రాయలసీమ ఉద్యమకారులు ఈ డిమాండ్‌ చేశారని, దీని కోసం పోరాడారని, అసలు ఇది శ్రీబాగ్‌ ఒడంబడిక అనే సంగతే  జ్ఞాపకం రాలేదు. 

మొత్తం అంధ్రప్రదేశ రాష్ట్రంలో రాయలసీమ స్థానమేమిటి? జనాభా ప్రాతిపదికన, వ్యవసాయ యోగ్యమైన భూమి ప్రాతిపదిక, విస్తీర్ణం ప్రాతిపదికన రాయలసీమకు  నిధులూ, నీళ్ళూ అందుతున్నాయా? నియామకాలు జరుగుతున్నాయా? అనేది సీమ విద్యావంతులు పట్టించుకుంటారా? లేక  ఎదో భిక్ష వేశారని  సరిపుచ్చుకుంటారా?  

అడగకపోతే అమ్మయినా అన్నం పెట్టదని అంటారు. చంటి పాపలు తమ డిమాండ్‌ వ్యక్తం జేయడం  కోసం మొదట ఏడుస్తారు. అప్పటికీ  ఎవరూ పట్టించుకోకపోతే చేతిలో వున్న వాటిని విసరి కొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం జేస్తారు. రాయలసీమ ప్రజలు చంటి పిల్లలు కాదు.   సీమ ప్రజలు దాదాపు మూడు తరాల నుండి ‘‘అంగట్లో అన్నీ వున్నా అల్లుని నోట్లో శని’’ అన్నట్టు జీవిస్తున్నారు. ఇక్కడ ఖనిజ వనరులున్నా,  కృష్ణా, తుంగభద్రా, పెన్నా లాంటి నదులున్నా.. ఏటా లక్షలాది ప్రజలు  నవంబర్‌ నెలనుండే పొట్ట చేత పట్టుకొని వలస ఎందుకు వెళుతున్నారు? స్వార్థ రాజకీయ నాయకుల గురించి, పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే  రాయలసీమ  నాయకుల గురించి  ఆరోపణలు చేయడం సరే! వారికి బుద్ధి చెప్పేందుకు  మనమే జేయాలి? ఆలోచించండి? కలసి సీమకై పని జేద్దాం. రాయలసీమ బిడ్డలుగా తల్లి రుణం తీర్చుకుందాం.

జై రాయలసీమ                                              జై,  జై రాయలసీమ