సంపాదకీయం
రాయలసీమ గొంతు చాలా చిన్నది. నలుగురిలో వినిపించదు. దాని గోడు ఏమిటో పెద్దగా పట్టింపు ఉండదు. నెల్లూరు నుంచి విశాఖపట్నం దాకా భూగోళం తెలిసినట్లయినా రాయలసీమ గురించి తెలియదు. మిగతా తెలుగు ప్రాంతాలకు రాయలసీమ ఎప్పుడూ ఇతరమే. సగటు తెలుగు ప్రజల గౌరవం, గుర్తింపు రాయలసీమకు తక్కువే. పైగా ప్రతికూల ముద్రలే ఎక్కువ. అలాంటప్పుడు రాయలసీమ జీవిత విషాదాల గురించి ఏం తెలుస్తుంది? తెలిసినా జాలి, సానుభూతి. అంతే. ‘అక్కడ నీళ్లు ఉండవట.. వానలు కురవవట..ఏటా వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారట..’ అనే అభిప్రాయాలు ఉంటాయి. వాటి వెనుక దశాబ్దాల కన్నీటి ఆరాటం పెద్దగా తెలియకపోవచ్చు. కేవలం నీటి కోసం పరితపించే నేల, హృదయం, జీవితం తమ పక్కనే ఉన్నాయని మిగతా తెలుగు ప్రాంతాలకు తెలియకపోవడం ఈ వ్యవస్థ కల్పించిన విషాదం.
సమానత్వం గీటురాయిగా ఉండాల్సిన ప్రజాస్వామ్యంలో ఇది తగునా? ప్రాకృతికంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా ఎన్ని తేడాలైనా ఉండవచ్చు. అవన్నీ వైవిధ్యాలే. ఉండదగినవే. కానీ ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య అసమానతలు, వెనుకబాటుతనం, వివక్ష మానవ కల్పితం. ప్రభుత్వాలు తెచ్చిపెట్టిన దుర్మార్గం. ఒక్క రాయలసీమే కాదు. భూమ్మీద ఏ ప్రాంతమైనా ఇంత అన్యాయానికి గురి కావచ్చునా? ఇది మానవతకు భంగకరం కాదా? ఆధునిక ప్రజాస్వామ్య విలువలకు భంగకరం కాదా? సమానత్వాన్ని మించిన నాగరిక భావన ఏమున్నది? దశాబ్దాలుగా కళ్లెదుటే నీళ్లుండి, అపారమైన సహజ వనరులుండి, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోగే ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ ఉండి, ఈ దేశంలో, రాష్ట్రంలో భాగమై ఉండి.. ఇంత వివక్ష ఏమిటని రాయలసీమ ప్రశ్నిస్తున్నది.
ఇదంతా పరాయివాళ్ల దుర్మార్గమే కాదు. రాయలసీమలోని పాలకవర్గం వందేళ్లకుపైగా సొంత సీమను దగా చేస్తున్నదని కూడా సీమ ప్రజలకు తెలుసు. రాయలసీమకు జరిగిన అన్యాయానికి ప్రకృతి కారణం కాదు. ఇది వ్యక్తుల ద్రోహమే కాదు. ఇది అసమ వ్యవస్థ ఫలితం. అధికార రాజకీయాల స్వభావం. ప్రభుత్వాలు ఎన్నుకున్న అభివృద్ధి విధానమే దీనికంతా కారణం.
వీటన్నిటి గురించి రాయలసీమ సుమారు వందేళ్లుగా మాట్లాడుతున్నది. కనీసం మూడు దశల పోరాట అనుభవాన్ని గడిరచింది. ఇప్పుడు మళ్లీ గొంతెత్తింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోతున్న సందర్భంలో ఈ దశ ఉద్యమానికి రాయలసీమ కొత్తగా గొంతు సవరించుకున్నది. గత ఉద్యమాలకంటే పరిణత స్వరంతో మాట్లాడుతున్నది. ఇందులో ఆవేశ బలానికంటే హేతుబద్ధత ఉన్నది. ఆగ్రహానికంటే ఆలోచన ఉన్నది. తరతరాల వంచనల వల్ల దు:ఖితురాలైనప్పటికీ విద్వేషానికిపోకుండా న్యాయబద్ధతను ప్రకటిస్తున్నది.
అయినా ఇప్పటికీ ఈ గొంతు బలహీనమైనదే. న్యాయం ఒక్కటే ఆలంబన. ఈ న్యాయ భావనను వినిపించడానికి రాయలసీమ విద్యావంతుల వేదిక ఏర్పడిరది. రాయలసీమలాగే వెనుకబడిన ప్రాంతాలన్నిటికి న్యాయం జరగాలని, సమానత్వం సిద్ధించాలని కోరుకొనే ప్రజాస్వామిక దృక్పథాన్ని స్వీకరించింది. ఇప్పటి దాకా రాయలసీమ గురించిన పరిశోధన, అధ్యయన రంగాల్లో పని చేసింది. సీమ ప్రజల తరపున తన వాదనను వినిపిస్తున్నది. అనేక పుస్తకాలు ప్రచురించింది. అయినా సొంత పత్రిక లేదు. ఆ లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. దాన్ని అధిగమించాలని చాలా కాలంగా అనుకుంటున్నది. అందులో భాగమే ఈ అంతర్జాల మాస పత్రిక. రాయలసీమ నీటిపారుదల, వ్యవసాయం, చరిత్ర, రాజకీయార్థిక రంగం, ప్రభుత్వ విధానాలు, విద్యా ఉపాధులు, కళా సాహిత్యాలు మొదలైన రంగాల్లో రాయలసీమ ఉద్యమ వేదికగా ఉండాలని ఈ ‘సీమస్వరాన్ని’ ప్రారంభిస్తున్నాం. దీనికి 29 సెప్టెంబర్ 2004న ప్రొద్దుటూరులో జరిగే నాలుగో రాష్ట్ర మహా సభ ఒక సందర్భరంగా కలిసి వచ్చింది. రాయలసీమ సహా మిగతా వెనుకబడిన ప్రాంతాల సమస్యలకు కూడా సీమ స్వరం సముచిత స్థానం ఇస్తుంది. ప్రాంతీయ సమస్యలను ప్రభావితం చేసే సాధారణ సామాజిక సమస్యలను కూడా సీమ స్వరం వినిపిస్తుంది.
ఈ దశ రాయలసీమ ఉద్యమాన్ని ‘సీమస్వరం’ దృఢంగా, ప్రజాస్వామికంగా వినిపించేలా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. రాయలసీమ ఉద్యమకారులు, మేధావులు, రచయితలు గొంతు కలిపితేనే సీమ స్వరం పాలకవర్గానికి వినిపిస్తుందని భావిస్తున్నాం. రాయలసీమ విషాదాన్ని, ఆగ్రహాన్ని, న్యాయభావనను, ఉద్యమ చైతన్యాన్ని వినిపించడానికి బృందగానం కావాలని అందరినీ సీమస్వరం అందరినీ ఆహ్వానిస్తోంది.
- సంపాదకవర్గం