Home ప్రకటనలు  విభజన అనంతర రాయలసీమ

విభజన అనంతర రాయలసీమ

95
0

రాయలసీమ విద్యావంతుల వేదిక నాలుగో రాష్ట్ర మహాసభ
29 సెప్టెంబర్ 2024, స్త్రీశక్తి భవన్, ప్రొద్దుటూరు

తెలుగు సమాజాల్లో రాయలసీమది ఒక వ్యథార్థ గాథ. తనకంటూ ఒక పేరు లేని దశ నుంచి పోరాటం ఆరంభించింది. సుమారు నూరేళ్ల్లుగా దగాపడుతూ, ఓడిపోతూ, నిందలకు గురవుతూ, లోపలా బైటా విద్రోహాలకు బలవుతూ అస్తిత్వాన్ని కాపాడుకోడానికి పెనుగులాడుతున్నది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల చేతిలో వంచనకు గురైనప్పటి నుంచి ఈ విషాదం కొనసాగుతున్నది. రెండు తెలుగు ప్రాంతాల మధ్య సమాన అవకాశాల కోసం జరిగిన శ్రీబాగ్ ఒప్పందం అమలు కాకపోగా వంచనగా చరిత్రలో నమోదైంది. కర్నూలు తాత్కాలిక రాజధానిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటే రాయలసీమకు ఆ తర్వాత కూడా జరిగిన విద్రోహాలకు పునాదిగా మారింది. అప్పటి నుంచి ఇక అంతా మోసం, నిర్లక్ష్యం, నయ వంచన. ఇందులో ఇతరుల దుర్మార్గం ఎంత ఉన్నదో సీమ నాయకుల పాత్ర కూడా అంతే ఉన్నది.

మామూలుగా ఏ వెనుకబడిన ప్రాంతానికైనా బైటి ప్రాంతాల దోపిడీ వర్గాల బెడద ఉంటుంది. అంతర్గత వలస సమస్యగా మారుతుంది. ఇతర ప్రాంతాల పాలకవర్గం నడిపే ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అన్యాయం జరుగుతుంది. వీటికి వ్యతిరేకంగా ప్రాంతీయ ఆకాంక్షలు ముందుకు వస్తాయి. కానీ రాయలసీమ కథ భిన్నమైనది. ఇందులో ఇద్దరు విలన్లు ఉన్నారు. క్రిష్ణా డెల్టా ప్రాంత పాలకవర్గంలాగే, రాయలసీమ పాలకవర్గం కూడా ఈ ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి ప్రధానంగా రాయలసీమ సంపన్న వర్గాల ప్రతినిధులే ముఖ్యమంత్రులయ్యారు. రెండు అగ్రకులాల నాయకులే అధికారం వెలగబెట్టారు. ఏ ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా పాలించాలి. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి కృషి చేయాలి. కానీ రాయలసీమ వ్యక్తులు ముఖ్యమంత్రులైనా ఈ ప్రాంతం అన్యాయానికి గురైంది. రాయలసీమను వెనుకబడిన, కరువు పీడిత ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పాలకులు అనుకోలేదు. చారిత్రాత్మకమైన శ్రీబాగ్ ఒప్పందాన్ని ఎవ్వరూ ఖాతరు చేయలేదు. ప్రాంతాల సమానత్వం అనే ప్రజాస్వామిక సూత్రాన్ని పాటించలేదు.

ఫలితంగా రాయలసీమ అన్ని రంగాల్లో తీవ్రమైన అసమానతకు గురైంది. మెట్ట ప్రాంతమనీ, వర్షపాతం తక్కువనీ, అనేక చారిత్రక కారణాల వల్ల సాంస్కృతికంగా వెనుకబడిరదనీ, ఇది ఆ ప్రాంత ప్రజల తలరాతనీ ప్రచారం చేశారు. దీనికితోడు గత ఇరవై ఏళ్ల కిందటి దాకా ప్రబలంగా ఉండిన ఫ్యాక్షనిజం వల్ల ఈ దుస్థితి ఏర్పడిరదని విశ్లేషించారు. కృష్ణా నది నుంచి రావలసిన నీళ్లను బచావత్ ట్రిబ్యునల్ పంచేసిందని, ఇక నీళ్లు లేవని, కాబట్టి ప్రాణం మీద తీపి ఉంటే వలస వెళ్లి బతకాల్సిందే తప్ప చేయగలిగిందేమీ లేదని ఆంధ్రా పాలకులు తీర్మానించారు. వాళ్ల తరపున రాజ్యాన్ని ఏలుతున్న రాయలసీమ పాలకులు దానికి వంత పాడారు. వెరసి రాయలసీమ కరువు కాటకాల సీమగా గుర్తింపు తెచ్చుకుంది. సగానికి సగం గ్రామాలు వలస వెళ్లితే తప్ప బతుకు లేని సీమగా మారిపోయింది.

ఈ దుస్థితిని ప్రశ్నిస్తూ 1985లో రాయలసీమ సమస్యల మీద కొద్ది కాలం ఉద్యమం నడిచింది. బచావత్ ట్రిబ్యునల్ నీళ్లు పంచేసింది కాబట్టి, మిగులు జలాలు ఉంటే ఇచ్చి పుణ్యం కట్టుకోండని ప్రాధేయపడిన ఉద్యమం అది. దానికి నాయకత్వం వహించిన వాళ్ల అధికార రాజకీయ ప్రయోజనాలు తీరాక ఆందోళన ఆగిపోయింది. వరదల మీద, ప్రభుత్వ దయా ధర్మాల మీద ఆధారపడిన మిగులు జలాల ఉద్యమమే అయినా అది కొన్ని విజయాలను సాధించింది. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులకు హామీలను సంపాదించింది.

ఇప్పటికీ ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఈలోగా ఆంధ్రప్రదేశ్లో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆరంభమైంది. ఇది తెలుగు ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఉన్న తీవ్రమైన అసమానతలను ముందుకు తెచ్చింది. ఆ ప్రాంత ప్రజల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారంగా తెలంగాణ వేరైపోయింది. ఈ విభజన రాయలసీమ చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన సందర్భం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నందు వల్ల ఇరు ప్రాంతాల అభివృద్ధికి ఈ చట్టం కొన్ని హామీలు ఇచ్చింది. దాని ప్రకారం రాయలసీమ నీటిపారుదల రంగంలో తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ సాగు నీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాలి. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, గుంతకల్ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, అనంతపూర్లో ఎయిమ్స్, చిత్తూరు జిల్లాలో బీహెచ్ఈఎల్ తదితర అంశాలు కూడా రాష్ట్ర విభజన చట్టం వాగ్దానం చేసింది.
ఉమ్మడి రాష్ట్ర విభజన సన్నాహక దశలోనే రాయలసీమలో ప్రాంతీయ సమస్యల మీద ఆందోళన మొదలైంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఒక వెనుకబడిన ప్రాంతంగా తన భయాలను వ్యక్తం చేసినట్లే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కూడా తన మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుందో అనే సందేహానికి లోనైంది. సుదీర్ఘకాలం ఆంధ్రా పాలకుల వంచనకు గురైన అనుభవం వల్ల విభజన సందర్భంలో అనేక రాయలసీమ సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి నిర్దిష్టమైన డిమాండ్లను ముందుకు తీసుకొని వచ్చాయి.

విభజన అనంతర రాయలసీమ భవిష్యత్తును ప్రభుత్వాల చేతిలో పెట్టి వదిలేయకుండా ఈ ప్రాంత ప్రజలు అనేక పోరాటాలు చేపట్టారు. అందులో ముఖ్యమైనది మే 31 2016న జరిగిన సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన. ఇది విభజన అనంతర రాయలసీమ ప్రజా పోరాటాలకు ఒక దారిని, స్ఫూర్తిని, అవగాహనను అందించింది. 1985లో జరిగిన రాయలసీమ ఉద్యమం కంటే ఇది గుణాత్మకంగా భిన్నమైనది. ఆధిపత్య, అధికార రాజకీయాల్లో ఉన్న నాయకుల నుంచి రాయలసీమ ఉద్యమాలు బైటపడ్డాయనడానికి ఇది ఒక సంకేతం. ఈ ఒరవడి కొనసాగుతూ ఉండటం రాయలసీమ ఉద్యమ భవిష్యత్తుకు ఒక గొప్ప భరోసా.

గత ఉద్యమం అప్పటి అవగాహన ప్రకారం కృష్ణా నదిలో మిగులు జలాలు ఇవ్వమని కోరింది. విభజన అనంతర ఉద్యమం రాయలసీమ నీటి ఉద్యమ మౌలిక పునాదినే మార్చేసింది. కృష్ణా బేసిన్లో ఉన్న వాస్తవ నీటి లెక్కలను బైటికి తీసింది. వాటి ప్రకారం ఆంధ్రా, రాయలసీమల మధ్య హేతుబద్ధ, ప్రజాస్వామిక నీటి పంపకాలు జరగాలని కోరింది. ఈ క్రమంలో గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు ఇవ్వడానికి చేపట్టిన పోలవరం ప్రాజెక్టు వల్ల మిగిలిన కృష్ణా జలాలను శ్రీశైలం జలాశయంలో నిలువ చేసి రాయలసీమ ప్రాజెక్టులకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. శ్రీశైలం జలాశయంలోకి వచ్చిన నీటిని వచ్చినట్లు కిందికి విడుదల చేయకుండా నిబంధనలు అమలు చేయాలని కోరింది. గాలేరు నగరి, హంద్రీ నీవా, తెలుగుగంగ పూర్తి చేసి రాయలసీమ మొత్తానికి నీరు అందించాలనే డిమాండ్ను బలంగా తీసుకొని వచ్చింది. ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు తుంగభద్ర సమాంతర కాలువను నిర్మించాలని, చెరువుల వ్యవస్థ ప్రధానంగా ఉన్న చిత్తూరు జిల్లాలో చిన్న నీటిపారుదలను బలోపేతం చేయాలని కోరింది.

మొత్తం మీద విభజన అనంతర రాయలసీమ ఉద్యమం గత ఉద్యమాలన్నిటికంటే పరిణతిని సాధించింది. ఆంధ్రా, రాయలసీమ నీటి సంబంధాలను కొత్త పరిస్థితుల్లో పునర్నిర్వచించింది. గత ఉద్యమాలు ఇరు ప్రాంతాల పెద్ద మనుషులు చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం మీద ఆధారపడితే, ఈ దశ ఉద్యమం విభజన చట్టం హామీలను కేంద్రం చేసుకున్నది. శ్రీబాగ్ ఒప్పదం చారిత్రక ప్రాధాన్యతను నిలబెడుతూనే విభజన చట్టం హామీలతో సహా రాయలసీమ సమగ్ర అభివృద్ధికి తగిన అవగాహనను ఈ దశ ఉద్యమం సంతరించుకున్నది.

విభజన అనంతరం 10 సంవత్సరాల్లో మొదట తెలుగుదేశం, ఆ తర్వాత వైసీపీ, తిరిగి మళ్లీ తెలుగుదేశం వంతులవారిగా అధికారంలోకి వచ్చాయి. రాయలసీమ గురించి ఎన్నకల ప్రకటనలు తప్ప నికరంగా చేసిందేమీ లేదు. కంటి తుడుపు చర్యలతో రాయలసీమ ప్రజల నుంచి విభజన అనంతరం జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మూకుమ్మడిగా ఓట్లు వేయించుకున్నాయి. ఈ రెండు పార్టీలు అధికారం చెలాయించాయేగాని రాయలసీమ ప్రాజెక్టులు పురోగతి సాధించలేదు. సాగునీటి నిర్మాణాలు శిథిóల నిర్మాణాలుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రాయలసీమ సాగునీటి హక్కులకు కేంద్రం అక్టోబర్ 2023లో తీసుకొచ్చిన గజిట్ నోటిఫికేషన్ ఇప్పటి దాకా రాయలసీమ ప్రజలు సాధించుకున్న నీటి హక్కులకు గండికొట్టింది. అయినా పాలక, ప్రతిపక్షాలు నోరు మెదపలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమంటే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష స్థానాల్లోకి అటూ ఇటూ మారుతున్న రెండు పార్టీలకూ భయం ఉన్నందు వల్ల ఈ నోటిఫికేషన్ను ప్రశ్నించలేదు. కనీసం బహిరంగపరచలేదు.

సారాంశంలో విభజన అనంతరం పాలకులు గతం కంటే మరింతగా రాయలసీమను వంచించారు. ఈ ప్రాంత ప్రజల హేతుబద్ధ వాదనలను, న్యాయమైన ఆందోళనలను దారి మళ్లించేందుకు కుయుక్తులతో వ్యవహరించారు. దీన్ని సమీక్షించి రాయలసీమ సమగ్ర అభివృద్దికి అవసరమైన ఎత్తుగడలను అనుసరించాల్సి ఉంది. దానికి తగిన డిమాండ్లు ముందుకు తేవాల్సి ఉన్నది. అనేక విద్రోహాల వల్ల వెనుకబడిపోయిన ప్రాంతం ఆంధ్రాతో సమానంగా అభివృద్ధి కావడానికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. రాష్ట్రంలో 41 శాతం భూభాగం ఉన్న రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో 41 శాతం నిధులు కేటాయించడంతో పాటు, అదనంగా మరో 20 శాతం నిధులను ఇవ్వాలి. రాయలసీమలో చట్టబద్ధమైన నీటి హక్కులను పరిరక్షిస్తూ, వాటి సంపూర్ణ వినియోగానికి ప్రాజెక్టుల సక్రమ నిర్వహణకు కావలసిన నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. రాయలసీమ ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు చేసి చెరువుల అభివృద్ధి, పర్యావరణ అభివృద్ధి చేపట్టాలి. పాలనా వికేంద్రీకరణలో భాగంగా చేపట్టాల్సిన హైకోర్టు, కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం, సీడ్ హబ్ (ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధృవీకరణ కేంద్ర ప్రధాన కార్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు), హార్టికల్చర్ హబ్ (హర్టీకల్చర్ కమీషనరేట్, ఉద్యానవన విశ్వవిద్యాలయం, హార్టీకల్చర్ పరిశోధనా కేంద్రం, హర్టీకల్చర్ మార్కెటింగ్, నిలువ గిడ్డంగులు, రవాణా తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు) అనేక రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, కార్పొరేషన్ కార్యాలయాలను రాయలసీమలో ఏర్పాటు చేయాలి. సిద్ధేశ్వరం అలుగు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అస్పష్టంగా శ్రీశైలం జలాశయంలో మరో జలాశయం కడుతామని అస్పష్ట ప్రకటన చేశారు. దాన్ని సవరించుకొని నిర్దిష్టంగా అలుగు, రోడ్డు నిర్మించాల్సి ఉన్నది.

కృష్ణా, తుంగభద్ర జలాలపై రాయలసీమ నీటిపారుదల వ్యవస్థ, వ్యవసాయం ఆధారపడి ఉన్నాయి. కృష్ణా బేసిన్లో రాయలసీమకు ఇవ్వదగినన్ని నీళ్లు ఉన్నాయని స్పష్టమైంది. కానీ ప్రభుత్వ చట్టబద్ధ హక్కులు కల్పించి జలాశయాలు నిర్మించాలి. ఇటీవలి వరదల్లో కూడా రాయలసీమలో ప్రస్తుతం ఉన్న జలాశయాలు సగం కూడా నిండలేదు. గుండ్రేవుల జలాశయం, సిద్ధేశ్వరం అలుగు నిర్మించి ఉంటే ఈ వరద నీరు దుర్వినియోగం అయ్యేవి కావు. ప్రభుత్వ అభివృద్ధి విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వరదల తర్వాత తిరిగి యథావిధిగా నీటి సమస్య, కరువు ముందుకు వస్తుంది.

ప్రభుత్వ అభివృద్ధి విధానం మీద వెనుకబడిన ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లోని రైతులు, పేదలు, నిరుద్యోగులు ఉద్యమించాల్సి ఉంది. ఈ దిశగా ప్రజలను చైతన్యపరచడమే రాయలసీమ విద్యావంతుల వేదిక లక్ష్యం. ఇందులో భాగంగా సెప్టెంబర్ 29న తలపెట్టిన మహాసభను విజయవంతం చేయాలని ప్రజలను, విద్యార్థులను, మేధావులను కోరుతున్నాం.