Home సాహిత్యం సీమ గ్రామీణ అనుభవ కథలు

సీమ గ్రామీణ అనుభవ కథలు

88
0

కుందు

దేవిరెడ్డి వెంకటరెడ్డి రాసిన ఈ కథలు వస్తు, శిల్పాల రీత్యా పూర్తిగా రాయలసీమ కథలు. సీమ పల్లె ప్రజల కథలు. ఆయన ఈ కథలు రాసే నాటికి రాయలసీమ పల్లెలు ఎట్లా ఉన్నాయో సరిగ్గా అట్లాగే ఈ కథలు అట్లాగే ఉన్నాయి.  వెంకటరెడ్డి పూర్తిగా స్థలకాలబద్ధమైన రచయిత. తను కథలు రాస్తున్న సందర్భంలో తన చుట్టుపక్కన ప్రజల అనుభవంలో ఏది ఉన్నదో అదే తన అనుభవంగా మార్చుకొని ఈ కథలు రాశారు. బహుశా స్థానిక ప్రజల అనుభవం, రచయిత అనుభవం చాలా వరకు ఒకేలా ఉన్నందు వల్ల ఈ కథలకు చాలా శక్తి వచ్చింది. కొన్ని సాధారణీకరించిన ఇతివృత్తాలు, కొన్ని నిర్దిష్ట ఇతివృత్తాలు కలిసి మొత్తంగా ఆయన ప్రాపంచిక దృక్పథాన్ని ఈ కథలు తెలియజేస్తాయి. సారాంశంలో ఆయన తన స్థల కాలాలను గుర్తెరిగి జీవితాన్ని అర్థం చేసుకున్నారు. అందువల్ల ఈ కథల్లోకి రాయలసీమ గ్రామీణ జీవితం చక్కగా వచ్చింది.

పల్లెలంటే ఇప్పటికీ వ్యవసాయ పల్లెలే. రాయలసీమలో కరువు పల్లెలే. పేదరికం, వెనుకబాటుతనం, అధికారయంత్రాంగంలోని నిర్లక్ష్యం, రాజకీయాల దివాళాకోరుతనం మొదలైనవన్నీ కలిసి రాయలసీమ పల్లె జీవితంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వెంకటరెడ్డి అట్లాంటి ప్రత్యేకతలను నిర్దిష్టతలను గుర్తించారు. అవే ఆయనను కథా రచనకు పురికొల్పాయి.

ఆయన చాలా ఆలస్యంగా కథా రచనలోకి వచ్చారు. తనకు ముందు కడప జిల్లాలో ఏర్పడి ఉన్న కథా రచనా మార్గాన్ని శ్రద్ధగా గమనించారు. 1970లనాటి తెలుగు కథా ప్రపంచంలోని ఆధునిక, ప్రగతిశీల దృక్పథాన్ని స్వీకరించారు. వాస్తవికతా వాదాన్ని సీమ జన జీవితం నుంచి అర్థం చేసుకున్నారు. జీవనవాస్తవికత మీద గౌరవం ఉన్న రచయిత కాబట్టి రాయలసీమ గురించి ఇంత గాఢంగా రాయగలిగారు. తాను స్వీకరించిన ప్రగతిశీల సిద్ధాంత దృక్పథాన్ని రాయలసీమ పల్లె జీవితం గీటురాయి మీద పరీక్షించుకోడానికి ఈ కథలు రాశారా? అనిపిస్తుంది. వాస్తవికతను వెంకటరెడ్డి యథాతథంగా చూసి సరిపెట్టుకోలేదని కూడా ఈ కథలు చెబుతాయి. వాస్తవికతను ఆయన హేతుబద్ధంగా, విమర్శనాత్మకంగా చూశారు. అందువల్లే  సీమ పల్లెల్లోని దు:ఖం, విషాదం, విధ్వంసం తన కథల్లోంచి వెలికి తీశారు. కరువు, అధికార వ్యవస్థలు, మార్కెట్‌ కలిసి పల్లె జీవితాన్ని ఎంతగా అతలాకుతం చేస్తున్నదీ గ్రహించారు. ఆయన ఈ కథలు రాసేనాటికి ఉన్న సీమ పల్లెలకు ఇవ్వాల్టి పల్లెలకు చాలా తేడా ఉండవచ్చు. పరిస్థితులు చాలా మారి ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు జరిగినట్లే రాయలసీమ పల్లెల్లో కూడా చాలా మార్పులు జరిగి ఉండవచ్చు. కానీ రాయలసీమ పల్లెల్లో సగటు పరిస్థితి పెద్దగా మారలేదు. ఈ కథల్లోని చిత్రణకంటే మరింత దిగజారిపోయింది. మరింత సంక్లిష్టంగా జీవితం మారిపోయింది. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోడానికి కాస్త వెనక్కి వెళ్లి రావడానికి కూడా వెంకటరెడ్డి కథలు దోహదం చేస్తాయి.

ఆయన కథన శిల్పం మీద కూడా కడప జిల్లాలోని తనకాలపు, తనకంటే ముందు కాలపు కథకుల ప్రభావం ఉంది. రాచమల్లు రామచంద్రారెడ్డి, సొదుం జయరాం ఒరవడి చాలా బాగా వెంకటరెడ్డి కథల్లో కనిపిస్తుంది. వాస్తవికతను తూచి చెప్పడానికి అవసరమైన శిల్ప పద్ధతిని ఆయన ఎన్నుకున్నారు. ఎక్కడా అతిశయోక్తికి పోకుండా, అతి వర్ణనలకు వెళ్లకుండా, విమర్శనాత్మకత కథా నిర్మాణాన్ని దాటి దెబ్బతీయకుండా రాశారు.  రాయలసీమ పల్లెల్లోని వాస్తవ స్థితికి కారణాలు చెప్పడంలో కూడా ఆయన ఎక్కడా కథాశిల్పాన్ని దెబ్బతీయకపోగా దానికి మరింత వెన్నె తెచ్చారు. ఈ వాస్తవ కారణాలు ఎట్లా మారడానికి అవకాశం ఉన్నదో కూడా కొన్ని కథల్లో సూచనగా చెప్పారు.

సారాంశంలో సీమ జన జీవితంపట్ల, కథా ప్రక్రియపట్ల అపారమైన గౌరవంతో  ఆయన ఈ కథలు రాశారు. అంతకుమించి తనకు తెలిసిన జీవితం, తను రాయగల పద్ధతి ఈ రెంటిపట్ల కూడా ఆయనకు చాలా వినయం ఉందని ఈ కథలు చాటి చెబుతాయి. ఇదంతా ఆయన కథల ప్రత్యేకతే కాదు. ఆయన వ్యక్తిత్వ ప్రత్యేకత కూడా.