Home నడచిన దారి సీమ విశ్లేషణ కోసం, పోరాటాల నమోదు కోసం

సీమ విశ్లేషణ కోసం, పోరాటాల నమోదు కోసం

91
0

వ్యాసం : (*మన రాయలసీమ* బులిటెన్ 1 సంపాదకీయం)

తెలుగు ప్రాంతాల్లో రాయలసీమది ఒక విచిత్రమైన స్థితి. దత్త మండలాలనే పేరును వదిలించుకొని ‘రాయలసీమ’ గుర్తింపు పొందినప్పటి నుంచి అనేక చారిత్రక దశలను దాటుకున్నదిగాని తెలుగు సమాజంలో భాగం కాలేకపోయింది. ఆంధ్రా, రాయలసీమ అనే ప్రత్యేకతల నడుమ తీవ్రమైన అసమానతలకు గురైంది. పాలనాపరంగా, భాషాపరంగా ఒక రాష్ట్రంలో భిన్న భూగోళాలు ఉండవచ్చు. వాటి సంస్కృతుల్లో తేడా కూడా ఉండవచ్చు(ఆ మాటకొస్తే రాయలసీమలోనే అనేక రాయలసీమలు ఉన్నాయి). కానీ ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతం మాత్రమే కేంద్రంగా ఉండటం, మరో ప్రాంతం అంచుల్లో ఉండటం అన్యాయం. ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో, విభజనానంతర ‘నవ్యాంధ్ర’లో రాయలసీమ స్థానం ఇట్లాగే ఉన్నది.

ఇది రెండు ప్రాంతాల గురించిన చర్చ మాత్రమే కాదు. తెలుగు జాతి నిర్మాణంలోనే ఇలాంటి అపక్రమం ఉన్నది. ప్రాంతాల భాషా సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలు, ప్రజల మానసికతలో తేడాలు ఎన్నయినా ఉండవచ్చు. కానీ ఆంధ్రా, రాయలసీమ రెండుగా  ఎందుకు ఉండిపోయాయి? తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగు రాష్ట్రం ఎదుర్కొన్న సంక్షోభాలు, సవాళ్ల గురించి మనకేమైనా అధ్యయనం ఉన్నదా? 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డానికి పూర్వం ఇప్పటి ఆంధ్రా, రాయలసీమల చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాలు ఏమైనా కావచ్చు. వాటి అభివృద్ధి వికాసాలు ఎట్లా అయినా కొనసాగి ఉండవచ్చు. దేని ప్రత్యేకతలు దానికి ఉండదగిన భోగోళిక, రాజకీయార్థిక ప్రత్యేకతలు ఉండవచ్చు. కానీ ఆ తర్వాత 70 ఏళ్లు ఒక రాష్ట్రంగా పాలన సాగుతున్నది. సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు అనే విలువల ప్రాతిపదిక మీద అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత దక్కి ఉండాల్సింది. నిజానికి ఒక్క రాయలసీమకే కాదు. అటు ఉత్తరాంధ్రకైనా, దక్షిణాంధ్రలోని ప్రకాశం, పల్నాడు ప్రాంతాలకైనా అలాంటి ప్రాధాన్యత దక్కిందా? అభివృద్ధి వికాసంలో సమాన అవకాశాలు కోల్పోయిన ఉప ప్రాంతీయాల గురించిన చర్చ జరుగుతున్నదా? సమభావం, ప్రజాస్వామిక దృక్పథం లేని పాలన మీద విమర్శ ఏమైనా ఉన్నదా?

తెలంగాణ వేరైపోయాక మిగిలిన తెలుగు ప్రాంతాల రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయాలనే ఆలోచన యాదృశ్చికం కాదు. బైటికి మాత్రం రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలని అన్నారు. ఇది కేవలం రైళ్ల రాకపోకలకు అందుబాటులో ఉండాలనుకోవడమే  కాదు. అదే నిజమైతే  రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం  రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలకు అనుకూలంగా అభివృద్ధి చేయవచ్చు. మధ్యాంధ్ర రాజకీయార్థిక కేంద్రంగా, పాలనా కేంద్రంగా రాష్ట్రం ఉండాలనే వ్యూహంలో భాగంగానే అమరావతి రాజధాని అయింది. ఆ తర్వాత మరో పార్టీ అధికారంలోకి రాగానే తమ కులం, గుంపు ప్రయోజనం కోసం విశాఖపట్నం రాజధాని అనే ప్రతిపాదనను తీసుకొచ్చింది కాని స్థూలంగా ఆంధ్రా కేంద్రక రాజకీయాల్లో ఎలాంటి తేడా లేదు. మధ్యాంధ్ర కేంద్రంగా ఇంత కాలం సాగిన రాజకీయాల్లో రాయలసీమ అంచుల్లోనే ఉన్నదనడానికి ఇదొక తాజా ఉదాహరణ మాత్రమే.

విషాదం ఏమంటే నీలం సంజీవరెడ్డి దగ్గరి నుంచి చంద్రబాబుదాకా, జగన్‌మోహన్‌రెడ్డి దాకా రాయలసీమ నాయకుల ఆధ్వర్యంలోనే ఈ ఆంధ్రా కేంద్రక రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలాంటి చోట ప్రజాస్వామ్యానికి తావు లేదు. సమభావానికి అవకాశం లేదు. ఒకరు అడుక్కొనేవారుగా, మరొకరు దయ తలచి ఇచ్చేవారుగా ఉంటారు. ఒకరు నిరంతరం విజ్ఞప్తి చేసేవారుగా మరొకరు  నిర్లక్ష్యం చేసేవారిగా, తిరస్కరించేవారిగా, వంచించి మోసం చేసేవారుగా మారిపోతారు. పాలకవర్గంలోని ఈ ఆధిపత్య ప్రాంత స్వభావం తెలుగు జాతి సమగ్ర వికాసాన్ని ధ్వంసం చేసింది. ప్రాంతాల మధ్య తీవ్రమైన అసమానతలు తీసుకొచ్చింది. ఉమ్మడితనానికికంటే వైరుధ్యాలనే ప్రధానం చేసింది. సకల అసమానతలకు కారణమైన పెట్టుబడి సహజంగానే ప్రాంతాల మధ్య అసమానతలకు కారణమవుతుంది.  ఫలితంగా ఒక ప్రాంతం కేంద్రంగా, మిగతా ప్రాంతాలు అంచుల్లో ఉండిపోయే స్ధితి ఏర్పడిరది.

తెలుగు సమాజ చరిత్రను అంచుల నుంచి అధ్యయనం చేయడం మొదలుపెడితే దశాబ్దాలుగా ఎంత దుర్మార్గం జరిగిందీ కొత్తగా తెలుస్తుంది. పాలకుల వర్గ ప్రయోజనాలు, అభివృద్ధి చెందిన ఆధిపత్య ప్రాంత ప్రయోజనాలు జమిలిగా ఎట్లా సాగుతున్నదీ అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రం వేరైపోయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు,  సాంస్కృతిక సంక్షోభాలకు, తప్పుడు చైతన్యాలకు మూలం ఇక్కడే ఉంది. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సమైక్యవాదం వినిపించినప్పటి నుంచి పోలవరం కడితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని సీమ ప్రాంత నాయకులు కూడా హంగామా చేసేదాకా మధ్యాంధ్ర కేంద్రక రాజకీయాలు రాయలసీమలోనూ  విస్తృతంగా సాగుతున్నాయి. అసలు రాయలసీమలో రాయలసీమేతర ఉద్యమాలు ఈ పన్నెండేళ్లలోనే ఎన్ని సాగాయో జాబితా తయారు చేయాల్సిందే. చంద్రబాబునాయుడుకానీ, జగన్‌రెడ్డిగానీ ఎన్నికల సమయంలో విభజన చట్టం ఆదేశాలను రాయలసీమలో అమలు చేస్తామనే మాట తప్ప నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చారు. ఈ విడత అధికారంలోకి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చాలా స్పష్టంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ అంటే ఇంతేనా? రాష్ట్రంలో రాయలసీమ లేదా? అని సీమ ప్రజాప్రతినిధులు ఒక్కరు మాట్లాడలేదు. మిగతా వెనుకబడిన ప్రాంతాల నాయకులు కూడా అనలేదు. పాలక రాజకీయాలు ఆధిపత్య వర్గ కుల రాజకీయాలుగానే కాక ఆధిపత్య ప్రాంత రాజకీయాలుగా కూడా అమలువుతాయని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? 

ఈ రాజకీయాల స్వభావాన్ని విప్పి చెప్పడానికి రాయలసీమ విద్యావంతుల వేదిక ఏర్పాటైంది. సరిగ్గా మధ్యాంధ్ర అగ్రకుల, సంసన్నవర్గ రాజకీయాలు సమైక్యవాదాన్ని లేవదీసినప్పుడు విద్యావంతుల వేదిక ఏర్పడిరది. ఈ సమైక్యత మధ్యాంధ్ర పాలకవర్గం తన కేంద్రంగా మిగతా ప్రాంతాలను, పేదలను తన చుట్టూ తిప్పుకోడానిక, దోచుకోడానికి తప్ప మరెందుకూ కాదని స్పష్టం చేసింది. దీనికి కొమ్ముకాస్తున్న రాయలసీమ ప్రాంత పాలకవర్గ స్వార్థ ప్రయోజనాలను, వంచన స్వభావాన్ని సమానంగా విమర్శిస్తూ బయల్దేరింది. రాయలసీమ అభివృద్ధికి, అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి  బైటా, లోపలా రెండు శక్తులు అడ్డంగా ఉన్నాయని చెప్పింది.

ఇది స్థూలంగా ఒక సామాజిక, చారిత్రక రాజకీయార్థిక సాంస్కృతిక వైఖరి. దీన్ని ఎప్పటికప్పుడు విస్తరిస్తోంది. ప్రధానంగా నీటి వాటా విషయం మీద కేంద్రీకరించినప్పటికీ మిగతా అన్ని రంగాల్లో ఈ పని చేస్తున్నది. ప్రాంతాల మధ్య సమానత్వం, సమాన అభివృద్ధి అనే గీటురాయి మీద ఉద్యమిస్తున్నది. రాయలసీమ అస్తిత్వం ధ్వంసమైపోకుండా కాపాడుకోవడం అంటే రైతులు, విద్యార్థులు, కార్మికులు, దళిత వెనుకబడిన కులాల, స్త్రీల అభ్యున్నతే తప్ప సీమలోని సంపన్నవర్గ ప్రయోజనాలు కాదు. రాయలసీమతో సహా మిగతా వెనుకబడిన ప్రాంతాల స్థితిగతులకు, తీవ్ర అసమానతలకు ప్రభుత్వ అభివృద్ధి నమూనా ప్రధాన కారణమనే అవగాహన వేదికకు ఉన్నది. ఈ కోణంలో  రాయలసీమ సామాజిక రాజకీయార్థిక రంగాల్లో పరిశోధనలు చేయాల్సి ఉన్నది.

సుమారు వందేళ్లుగా సాగుతున్న రాయలసీమ  ప్రాంతీయ, ప్రజా ఆకాంక్షలు  ఇవాళ ఒక కొత్త దశకు చేరుకున్నాయి. అనేక ఆటుపోట్ల మధ్యనే ఉద్యమ రూపాన్ని తీసుకుంటున్నాయి. రాయసీమ పోరాట సంస్థలు  ఎన్నో ఏర్పడి కలిసి పని చేస్తున్నాయి. ఈ ఉద్యమాలకు, విశ్లేషణలకు  పెన్నేరు పత్రిక వేదికగా ఉంది. ఇప్పుడు ఆ అవసరం ఇంకా పెరిగింది. ఇందులో భాగంగా రాయలసీమ విద్యావంతుల వేదిక   అనియత కాలంగా ఒక  బులిటెన్‌ తీసుకరావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 29న కడప జిల్లా ప్రొద్దుటూరులో జరుగుతున్న వేదిక నాలుగో రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ ప్రయత్నంలోకి దిగాం. ఈ సంచికను చదవండి. చర్చించండి. రాయలసీమ ఉద్యమ వికాసానికి తగిన రచనలు పంపి సాయపడండి. 

  సంపాదకవర్గం