సంపాదకీయం
ఈసారి అంతటా ముంచెత్తే వరదలు. అంతగా వానలు కురిశాయి. ఎక్కువ వర్షపాతం ఉంటే ఊళ్లు, నగరాలు మునిగిపోవడం మామూలే అని సగటు మనుషులు అనుకుంటారు. ఇది చాలా పాతకాలపు అభిప్రాయం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన తర్వాత కూడా ఇట్లా అనుకోవచ్చునా? నీటిపారుదల ఇంజనీరింగ్ ఎంతో అభివృద్ధి కావలసిన కాలంలో కూడా గట్టిగా వానలు కురిస్తే వరదలు వస్తాయని, వానలు కురవకపోతే కరువు వస్తుందని అనుకోవచ్చునా? అట్లా జరిగి తీరాల్సిందేనా? సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రజాస్వామిక సూత్రాలు, సాంకేతిక రంగాల్లో శాస్త్రీయ అవకాశాలు ఇంత అభివృద్ధి చెందాక కూడా వరదలు, కరువులు తప్పవా?
ప్రభుత్వాలకు సమానత్వం, సామాజిక భద్రత, న్యాయభావన గీటురాళ్లు అయితే ఇట్లా కావడానికి వీల్లేదు. వరదలు, కరువులు రాకుండా చేయగల విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి. వరదలను, కరువులను ఏమీ చేయలేమని చేతులు ఎత్తేసేటట్లయితే ఇక ప్రభుత్వాలే అక్కరలేదు. పాలనలో ప్రజాస్వామిక విధానాలు అవసరమే లేదు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది.
శ్రీశైలం జలాశయానికి డెబ్పై రోజులకు పైగా వరద కొనసాగుతోంది. రిజర్వాయర్ పూర్తిగా నిండి ఉంది. నీటికి కొదువ లేదు. కానీ శ్రీశైలం నుంచి రాయలసీమ జలాశయాలకు, కాలువలకు కేవలం 100 టీఎంసీల నీరే ప్రవహించింది. కనీసం 250 టీఎంసీల నీరు తీసుకోడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి నీటిపారుదల వ్యవస్థను రాయలసీమలో అభివృద్ధి చేయలేదు. మరి శ్రీశైలం జలాశయంలో ఉన్న నీరంతా ఏమవుతుంది? కిందికి ప్రవహించి కోస్తా అవసరాలు తీర్చి ఇంకా మిగిలిన వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంది.
రాయలసీమలో మాత్రం మళ్లీ అదే కరువు. దీన్నేమీ ఊహించాల్సిన పని లేదు. ఇప్పటికే కరువు సీజన్ ఆరంభమైంది. వానల మీద ఆధారపడి సేద్యం చేసే చోట సీజన్‌లో ఎంత భారీ వర్షాలు కురిసినా మరుసటి రోజు నుంచే కరువు మొదలవుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంత అభివృద్ధి చెందాక కూడా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలు ఉన్నాయంటే కరువు కేవలం ప్రకృతి సమస్య కాదని అర్థం. అది వ్యవస్థీకృత సమస్య. పాలకవర్గ ప్రజా వ్యతిరేక, వెనుకబడిన ప్రాంత వ్యతిరేక అభివృద్ధి విధానాల వల్ల కరువు సామాజిక రాజకీయ సాంస్కృతిక సమస్యగా మారిపోతుంది. ప్రాంతాల అసమానతలకు ఒక దుర్మార్గమైన, అమానవీయమైన వ్యవస్థీకృత రూపంగా కరువు తాండవిస్తుంది. అందుకే రాయలసీమలాంటి ప్రాంతాల్లో కరువు రావడం, పోవడం అనేది ఉండదు. సాలీనా వర్షపాతం ఎంత అనే లెక్కలతో దానికి సంబంధమే ఉండదు. వానలు ఎక్కువ కురిస్తే కరువు పీడిత ప్రాంతాల్లో కూడా వరదలు వస్తాయి. ఊళ్లను వరదలు ముంచెత్తుతాయి. రాయలసీమకు కూడా అడపాదడపా వరదతాకిడి తప్పడం లేదు. ఊళ్లు, పంటలు మునిగిపోయాక తేరుకోవడమంటే మళ్లీ కరువువాతన పడటమే.
ఈ వ్యవస్థాగత తర్కం పత్రికలకు తెలియదు. ఆ రోజు కంటికి ఏది కనిపిస్తే దాన్నే సత్యమని పత్రికలు, టీవీలు నమ్ముతాయి. దాన్నే అందరూ నమ్మాలని దబాయిస్తాయి. వాటినే ఆరోజుకు వార్తలుగా రాసేస్తాయి. ప్రసారం చేస్తాయి. మళ్లీ రేపు ఇంకోటి కంటికి కనిపిస్తుంది. అది ఎల్లుండికి వార్త అవుతుంది. ఈసారి భారీ వర్షాల తర్వాత దిన పత్రికల పతాక శీర్షికలను గమనిస్తే ఇది తెలుస్తుంది. ఆ మధ్య ఓ దిన పత్రిక ‘కోనసీమలా కోసిగి’ అని శీర్షిక పెట్టి ఒక కథనం ప్రచురించింది. నిజంగానే దానికి తగినట్లు పచ్చటి పంట పొలాల ఫొటోలు చూపెట్టింది. నిత్యం కరువుతో తల్లడిల్లే పశ్చిమ కర్నూలులో కోసిగి భాగం. ఏడాదికి రెండుసార్లు వలస వెళ్లే మండలం అది. ఇటీవలి వర్షాలకు ఎక్కడో నాలుగెకరాలు పచ్చగా పత్రికల వాళ్లకు కనిపించాయి. అంతే. కోనసీమను తలపిస్తోందని పులకించి రాసేశారు. అలాంటి దృశ్యాలన్నీ తిరిగి నెర్రెలువారుతున్నాయి. అక్టోబర్ గడచి నవంబర్ వచ్చేనాటికి వేసిన పంటలన్నీ ఎండిపోయి పొట్ట చేతపట్టుకొని వేల గ్రామాల నుంచి లక్షలాది మంది వలస వెళ్లడానికి సిద్ధమవుతారు. వందల మంది రైతులు సేద్యపు అప్పులు తీర్చలేక, జీవితం భారమై ఆత్మహత్య చేసుకుంటారు.
దీన్ని కూడా ఊహించాల్సిన పని లేదు. ఏటా జరిగేదే. ఈ ఏడాది కూడా ఈ పరిస్థితి మొదలైంది. పంటలు ఎండిపోతున్నాయని పత్రికల్లో కథనాలు మొదలయ్యాయి. అనంతపురం జిల్లాలో రోజూ మేఘాలు కమ్ముకున్నా, వానలు లేక పంటలు ఎండిపోతున్నాయి. పంటలకు కీలకమైన సెప్టెంబర్‌లో వానలు లేక వేరుశనగ, పత్తి, కంది పంటలు ఎండిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసినా, అనంతపురంలో కూడా ఎంతో కొంత కురిసినా అక్కడ భూగర్భ జలాలు పెరగలేదు. అట్లా పెరగడానికి తగిన నీటి యాజమాన్య వ్యస్థలు లేవు. కురిసిన వాన నీరంతా వాగుల్లో పడి నదుల్లో కలిసి కిందికి ప్రవహించింది. మళ్లీ వానలు కురిస్తే తప్ప భూగర్భ జలాలు కూడా ఆదుకోలేని దురవస్థ అనంతపురానిది. ఈ పరిస్థితి రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా అన్ని జిల్లాల పశ్చిమ ప్రాంతాలన్నీ ఇట్లాగే ఉన్నాయి. పంటలు ఎండిపోయి, పశువులకు గడ్డిలేక, ఊళ్లో పనులు లేక వలస వెళ్లడం తప్ప సీమ గ్రామాల్లో వేరే గత్యంతరం లేదు. అప్పులకు వడ్డీలు కూడా కట్టలేక రైతులకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు.
వర్షాధార సేద్యానికి రాయలసీమలోని మెజారిటీ పల్లెలను వదిలేశాక ఎంత వర్షపాతం నమోదైతే ఏం ఫలితం ఉంటుంది? ఒక్క పంటకు కూడా సాగునీరు అందివ్వగల నీటి పారుదల సౌకర్యం కల్పించనప్పుడు ఎన్ని వరదలు వస్తే ఏం లాభం ఉంటుంది? కృష్ణా బేసిన్‌లో ఎన్ని వరదలు వచ్చి ఎంత పొటెత్తితే మాత్రం రాయలసీమ కరువు పల్లెల వైపు ఎంత నీరు ప్రవహిస్తుంది? ఇంత జరుగుతున్నా వరదలను, కరువులను ఇప్పటికీ ప్రకృతి సమస్య అనే ఇంకా అనుకుందామా?