Home ఆకాంక్షలు సీమలో వందకు తొమ్మిది ఎకరాలకే నీళ్లు

సీమలో వందకు తొమ్మిది ఎకరాలకే నీళ్లు

58
0

ప్రసంగ వ్యాసం: బొజ్జా దశరథరామి రెడ్డి

రాయలసీమ విద్యావంతుల వేదిక 4 వ  రాష్ట్ర మహాసభలకు నన్ను ఆహ్వానించినందుకు విద్యావంతుల వేదిక కార్యవర్గానికి, నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మహమ్మద్ గారికి, వేదిక మీద ఉన్న రామాంజనేయులు గారికి, భాస్కర్ రెడ్డి గారికి, సమావేశానికి విచ్చేసిన రైతు సోదరులకు, విద్యార్థులకు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులకు, పత్రిక విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు.

రాయలసీమ విద్యావంతుల వేదిక నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలకు రాయలసీమ నాలుగు జిల్లాల నుండి పెద్ద ఎత్తున రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొనడం రాయలసీమ సమస్యల పరిష్కార దిశగా తొలి అడుగుగా నేను భావిస్తున్నాను. రాయలసీమ సాగునీటి రంగ విషయాలపై రాయలసీమ సమాజం అంతగా దృష్టి కేంద్రీకరించకపోవడంతో, పాలకులు మభ్యపరిచే మాటలతో నెట్టుకొస్తున్నారు. రాయలసీమ సమాజం తప్పకుండా సాగినీటి రంగం మౌలికమైన విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఆ దిశగా వక్తల ప్రసంగాలను శ్రద్దగా వినాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ తెలుసుకున్న  విషయాలపై  పదిమందితో  చర్చించడం ద్వారా సమాజంలో పెరిగే అవగాహన తప్పకుండా పాలకులపై ఒత్తిడి తెస్తుంది. అందువల్ల ఇలాంటి సమావేశాల్లో మీరు మీ మొబైల్ ఫోన్స్ ను ఆఫ్ చేసి,  అత్యంత శ్రద్ధగా సాగునీటి విషయాలపై అవగాహన పెంపొందించుకొని రాయలసీమ సాగినీటి రంగాన్ని గాడిలో పెట్టే కార్యక్రమంలో మీరు భాగస్వామ్యలు అవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 

ఈ వర్ష సంవత్సరంలో శ్రీశైలం రిజర్వాయర్ కు వరద 70 రోజులుగా కొనసాగుతుంది.  శ్రీశైలం రిజర్వాయర్ 60 రోజులుగా నిండుకుండలా ఉంది,  శ్రీశైలం రిజర్వాయర్ లో పూర్తిస్థాయిలో నీరు ఉంటే రోజుకు నాలుగు టీఎంసీలు  నీటిని తీసుకునడానికి అవసరమైన మౌలిక వసతులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా ఈ 60 రోజుల్లో సుమారుగా 240 టి ఎం సీ ల నీరు రాయలసీమకు తీసుకునే అవకాశం ఉంది.  అదేవిధంగా మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా నాలుగు రోజులకు ఒక టిఎంసి లాగా ఈ 60 రోజుల్లో 15 టిఎంసి ల నీటిని పొందే అవకాశం ఉంది‌. అంటే ఈ 60 రోజుల్లో సుమారుగా 255 టిఎంసీలు నీరు  రాయలసీమ ప్రాజెక్టులకు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ కేవలం 100 టిఎంసి ల  నీటినే రాయలసీమ పొందగలిగింది.  ఈ నీటిని తరలించే ప్రధాన కాలువలు,  రిజర్వాయర్లు తగిన సామర్థ్యంతో నిర్మించకపోవడం,  నిర్మించినవి కూడా శిథిలావస్థకు చేరడమే ఈ దుస్థితికి కారణం.‌

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం మరియు నిర్వహణ పట్ల మొదటి నుండి పాలకులు నిర్లక్ష్యం గానే  వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తాగునీటి రంగ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో 44 శాతం ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది.‌ కానీ రాయలసీమలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో కేవలం 21 శాతం ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది.‌ కృష్ణొ నదిపై ఆధారపడిన అభివృద్ధి చెందిన మధ్యాంధ్ర (కృష్ణ గుంటూరు జిల్లాలు) వ్యవసాయ యోగ్య భూమిలో 75 శాతం ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ఉత్తరాంధ్రలో కూడా వ్యవసాయకిమైన భూమిలో 54 శాతం ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఇంకొక మాటలో చెప్పాలంటే రాయలసీమలో 100 ఎకరాల్లో 21 ఎకరాలకు సాగునీరు అందేలాగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే, అభివృద్ధి చెందిన మధ్యాంధ్రలో 100 ఎకరాల్లో 75 ఎకరాలకు,  వెనుకబడిన ఉత్తరాంధ్రలో 100 ఎకరాల్లో 54 ఎకరాలకు నీరు అందేలాగా సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల కంటే కూడా రాయలసీమలో  సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఎంత వెనుకబడిందో స్పష్టంగా తెలుస్తుంది.

ఇక నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వినియోగం జరుగుతున్న అంశాలను పరిశీలిస్తే రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్యం మరింత స్పష్టంగా అర్థం అవుతుంది.‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 30 శాతం ఆయకట్టుకు నీరు లభిస్తున్నది.‌ కానీ రాయలసీమలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 9 శాతం ఆయకట్టుకు మాత్రమే నీరు లభిస్తున్నది.‌ అభివృద్ధి చెందిన మధ్యాంధ్ర (కృష్ణ గుంటూరు జిల్లాలు) వ్యవసాయ యోగ్య భూమిలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 67 శాతం ఆయకట్టుకు నీరు లభిస్తున్నది.‌ ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ఉత్తరాంధ్రలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 30 శాతం ఆయకట్టుకు నీరు లభిస్తున్నది.

‌ఆంధ్రప్రదేశ్ సగటు సాగునీరు పొందుతున్న ఆయకట్టు 30 శాతంకు సమానంగా అంటే 100 ఎకరాలకు గాను 30 ఎకరాలకు సాగునీరు ఉత్తరాంధ్ర లో,  67 ఎకరాలకు మధ్యాంధ్ర లో సాగునీరు పొందుతుంటే, రాయలసీమలో 100 ఎకరాలకు కేవలం 9 ఎకరాలకు మాత్రమే సాగునీటిని ప్రాజెక్టుల ద్వారా పొందుతున్నది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పట్ల పాలకుల నిర్లక్ష్యానికి ఈ గణాంకాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాయలసీమ సాగునీటి రంగం సమాన అభివృద్ధి జరగకపోగా, నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ కూడా సరిగా లేకపోవడం వల్ల ఆ నీటిని వినియోగించుకోవడంలో కూడా రాయలసీమ విఫలమవుతోంది అన్న విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రకృతి కనికరించినా,  పాలకుల విధానాల వల్ల రాయలసీమ సాగునీటి రంగం ఎదుర్కొంటున్న పరిస్థితులపై ప్రజలకు అవగాహన చేస్తున్న నేపథ్యంలో, వారిని మభ్యపరిచే రీతిలో రాయలసీమ లో ప్రాజెక్టులన్ని జలకలతో ఉన్నాయన్న వార్తలను దినపత్రికలు సమాజం ముందుంచుతున్నాయి‌.   ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ప్రాజెక్టులు జలకలతో ఉన్నాయన్న గణాంకాలను జలవనరుల శాఖ పత్రికలకు విడుదల చేస్తున్నది. రాయలసీమ రిజర్వాయర్లు అన్ని  జలకలతో నిండుగా ఉన్నాయన్న ప్రకటనలు గుప్పిస్తున్న జలవనుల శాఖ శాఖ అధికారులు,  ఈ సంవత్సరం ఎన్ని లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తారో విస్పష్టంగా ప్రకటించాలి.‌ రాయలసీమలో నిర్మించిన 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు  నీరు ఇవ్వగలుగుతారా అనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రిజర్వాయర్ల ద్వారా పొలాలకు నీళ్లు అందించడానికి, అవసరమైన సామర్థ్యంతో ప్రధాన కాలువలు, పంట కాలువలు లేని విషయాన్ని ప్రజలకు వివరించకుండా జాగ్రత్త పడుతున్నది జలవనరుల శాఖ. రాయలసీమ హక్కుగా ఉన్న ఆయుకట్టుకు పూర్తిగా నీరు అందించలేని పరిస్థితిని జలవనరుల శాఖ దాచిపెట్టి ప్రకటనలు చేస్తోందన్న  విషయాన్ని రాయలసీమ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది.‌

కడప జిల్లాలో రిజర్వాయర్లన్నీ జలకలతో నిండుగా ఉన్నాయని ప్రకటనను ఈరోజు దినపత్రికలో ఇచ్చారు.  జలకలతో నిండుగా ఉన్న ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలరో,  ఆ ప్రకటనలో జలవనురుల శాఖ తెలపకపోవడం ఆక్షేపనీయం.  గండికోట రిజర్వాయర్ నిండా నీళ్లు ఉన్నా , గాలేరు నగరి ప్రాజెక్టు లో  ఒక్క ఎకరాకు నీరు అందించడానికి కూడా పంట కాలువల నిర్మాణం జరగలేదు. మైలవరం ప్రాజెక్టు నిండా నీళ్లు ఉన్నా పంటకాల్వల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల కేవలం  100 – 110 క్యూసెక్కుల నీటిని ఇరువైపు ఉన్న కాలువల ద్వారా వదులుతూ, స్పిల్ వే గేట్లు ఎత్తి 12వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నది ద్వారా సోమశిల కు తరలిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలి.  శ్రీశైలం రిజర్వాయర్ కు 70 రోజుల వరద తర్వాత కూడా బ్రహ్మ సాగర్  రిజర్వాయర్ సామర్థ్యంలో  సగ భాగానికి మాత్రమే నీరు నింపగలిగారు.   బ్రహ్మ సాగర్  రిజర్వాయర్ ద్వారా 1,60,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉంటే, పంట కాలువలు లేకపోవడం వల్ల 30000 ఎకరాల ఆయకట్టు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది.

కృష్ణా నది వరద ప్రవాహంతో శ్రీశైలం రిజర్వాయర్ అత్యధిక దినాలు నిండుకుండలా ఉన్నా, రాయలసీమ‌ నీటిని వినియౌగించుకొనలేని పరిస్థితి స్పష్టంగా అవగతం అయ్యింది. ఈ విషయాలను రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాలు స్పష్టంగా సమాజం ముందంచగలిగాయి.‌ పాలకుల వైఫల్యాలతో రాయలసీమ సాగునీటి రంగానికి జరిగిన నష్టాన్ని సమాజం ముందుకు ప్రజా సంఘాలు విస్తృతంగా తీసుకొని పోయిన నేపథ్యంలో, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు హంద్రీనీవా ప్రాజెక్టు సందర్శన క్షేత్రస్థాయి పరిశీలనకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం కంటే తాము అధికారంలో ఉన్న 2014-19 కాలంలో అధికంగా నిధులు ఖర్చు పెట్టామని ప్రకటించారు‌. గత వైసిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి బడ్జెట్ లో కేవలం 6% నిధులను రాయలసీమ సాగునీటి రంగానికి ఖర్చు పెట్టిందని, తమ ప్రభుత్వం గతంలో 17 శాతం నిధులు ఖర్చు పెట్టిందని ప్రకటించారు.   రాయలసీమ సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని ప్రకటన చేయడం ఆహ్వానించ దగ్గ విషయం.  అయితే రాయలసీమలో నిర్మించిన ప్రాజెక్టుల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి బడ్జెట్లో నిధులను కేటాయించి ఖర్చు చేయాల్సి ఉంది. ఈ దిశగా మొదటి అడుగుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42 శాతం ఉన్న రాయలసీమ లో సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టడానికి రాష్ట్ర సాగు నీటి బడ్జెట్ లో 42 శాతం నిధులు కేటాయించాలి. ఈ నిధులను ఖర్చు చేసి నిర్మాణాల నిర్వహణను సక్రమంగా చేపట్టగలిగితేనే, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి. ఆ విధంగా కాకుండా ఆ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం అధికంగా ఖర్చు పెడుతుంది అన్న మాటల వల్ల రాయలసీమ సాగునీటి రంగం గాడిన పడే పరిస్థితి లేదనేది పాలకులు గమనించాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా రాయలసీమ సాగునీటి రంగం అభివృద్ధి చెందాలంటే, రాష్ట్ర బడ్జెట్లో 42 శాతం నిధులకు అదనంగా ప్రత్యేక నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం రాబట్టి సమానాభివృద్ధికి తోడ్పడాలి.‌ దీనికోసం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన నిధులను, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రపంచ బ్యాంకు నిధులను, స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా నిధులను సాధించి రాయలసీమ సాగునీటి రంగ సమాన అభివృద్ధికి కార్యాచరణ చేపట్టాలి.  రాయలసీమలో చెరువుల పునరుద్ధరణకు, నిర్మాణానికి వాటిని వాగులు, వంకలు, కాలువలు, నదులతో అనుసంధానం చేయడానికి, సామాజిక అడవుల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ చేపట్టి, పెన్నా నది పునరుద్ధరణ చేయడానికి ప్రత్యేక రాయలసీమ పర్యావరణ కమిషన్ ఏర్పాటు చేయాలి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటుగా,  రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజీ నిధులను సాధించి, వినియోగించి రాయలసీమ సాగు నీటి  రంగం అభివృద్ధి చెందిన ప్రాంతంతో సమాన అభివృద్ధి చెందడానికి కృషి చేయాలి.

నిర్వహణ, నిర్మాణ లోపంతో రాయలసీమ సాగునీటి రంగం కుదేలైపోతుంటే పాలకుల విధానపరమైన నిర్ణయాలు కూడా రాయలసీమ సాగునీటి రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. కృష్ణా డెల్టాకు చట్టబద్ధంగా కేటాయించిన కృష్ణా జలాలను సముద్రంలో పారబోస్తూ, శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని పొందే లాగా జూన్ 18 – 19 2015 న జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించింది. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ ప్రకాశం బ్యారేజ్ ల మధ్య తెలంగాణ నుండి ప్రవహించే నదుల ద్వారా 101 టి ఎం సీ  ల నీటి కేటాయింపులను చేసింది. ఈ నీటిని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం, కేవలం  20 టిఎంసి ల నీటినే వినియోగించుకుంటున్నాం,  అందువలన  మిగిలిన నీటిని నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ నుండి పొందేలాగా పై సమావేశంలో తీర్మానాలు చేసారు.‌ ఈ తీర్మానం జరగకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డు పెట్టడానికి ప్రయత్నం చేస్తే, కృష్ణా డెల్టా ఆధునీకరణ వల్ల ఆదా అయిన 20 టి ఎం సీ నీటిని  తెలంగాణా రాష్ట్రంలోని బీమా ప్రాజెక్టు కేటాయించామని, కృష్ణా డెల్టా ఆధునీకరణ పూర్తికానందు వల్ల దానికి అయ్యే నిధులను తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని ఒక మడత పేజీ పెట్టారు. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్రం ఆర్థిక భారం నుండి బయట పడవేయటానికి బదులుగా,  శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా డెల్టాకు నీరు తీసుకునే లాగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత స్థాయి జలవనరుల  శాఖ అధికారులు క్రియాశీలక పాత్ర వహించారు.‌ ఈ నిర్ణయంతో కృష్ణా డెల్టా హక్కుగా ఉన్న నీటిని సముద్రంలో పారబోస్తూ,  రాయలసీమ హక్కుగా ఉన్న నీటిని వినియోగించుకోలేని పరిస్థితిని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు రూపొందించారు. రాయలసీమకు శ్రీశైలం రిజర్వాయర్ లో హక్కుగా ఉన్న నీటికి ఆధనంగా, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన తుంగభద్ర జలాలు కూడా శ్రీశైలం రిజర్వాయర్ చేరుతున్నాయి. తుంగభద్ర డ్యామ్ లో పూడిక చేరడం వల్ల తుంగభద్ర ఎగువ, దిగువ కాలువదకు కేటాయించిన నీటిని వినియోగించుకోలేక,  ఆ నీరంతా శ్రీశైలం రిజర్వాయర్ చేరుతున్నది.  రాయలసీమ హక్కుగా ఉన్న  నీటిని, శ్రీశైలం రిజర్వాయర్ లో రాయలసీమ నిలువ చేసుకున్న నీటిని కృష్ణా డెల్టాకు తరలించడం అత్యంత శోచనీయం. ఇది రాయలసీమ సాగునీటి రంగానికి తీవ్ర విఘాతం కలగజేస్తోంది. కుంచిత బుద్ది ఉన్న కొందురు ఉన్నతాధికారులను ప్రభావితం చేసి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనపడుతుంది. కృష్ణా డెల్టా కు కేటాయించిన నీటి నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మాణం చేస్తే, తమ ప్రాంతంలో సాగుభూమి మునిగిపోతుందని,  శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని తరలించే కార్యక్రమాన్ని కృష్ణా డెల్టా కేవలం 2015 సంవత్సరం నుండి మాత్రమే చేపట్టలేదు. ఇదే ఉద్దేశంతోనే 1996 సంవత్సరంలో శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని 854 అడుగుల నుంచి 834 అడుగులకు తగ్గించారు. దీనితో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీరు అందకుండా చేసిన చర్యను కూడా రాయలసీమ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో జలవనుల శాఖ ఉన్నతాధికారులు చేస్తున్న ఈ నిర్వాకం ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి విఘాతం కలుగజేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి సంపద సృష్టికి సాంకేతిక నిపుణులతో పాటుగా, సమ భావన,  విశాల హృదయం,  ప్రజాస్వామ్య దృక్పథం, అన్ని ప్రాజెక్టుల మీద అవగాహన ఉన్న వ్యక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర లోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి సమగ్రతకు విధానాలు రూపించాల్సిన నిరూపించాలని ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.

గత 12 ఏళ్లుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి,  అనేక రాయలసీమ ప్రజా సంఘాలు రాయలసీమ అస్తిత్వం కోసం అంశాల వారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు రాయలసీమ ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా జరుగుతున్నాయి.‌ కాని ఇదే సందర్భంలో చైతన్యవంతమైన సమాజాన్ని మభ్యపరిచే దిశగా కూడా అనేక శక్తులు పనిచేస్తున్న విషయాన్ని కూడా రాయలసీమ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. తమ అస్తిత్వం కోసం, రాజకీయ పార్టీల పంచన చేరి ఉద్యమం చేస్తున్న కొంత మంది ఉద్యమ నాయకులు  ఒకవైపు,  పాలకుల మెప్పు కోసం, సత్కారాల కోసం ఆశపడే కొందరు సాహితీవేత్తలు ఇంకొక వైపు, ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చిడం ద్వారా ప్రభుత్వం మెప్పు  పొందడానికి ఆరాటపడే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మరొక వైపు, అధికార పార్టీ బాకా ఊదడమె లక్ష్యంగొ పనిచేస్తున్న   కొన్ని వార్త పాత్రికలు ఇంకొక వైపు, అధినేత మెప్పు కోసం అత్యుత్సాహంగా పనిచేస్తున్న కొందరు రాజకీయ  ప్రతినిధులు మరొక వైపు పని చేస్తున్నారు. ఈ శక్తులను అన్నింటిని ఒక కంటితో రాయలసీమ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది. రాయలసీమ అస్తిత్వం కోసం అంశాల వారిగా నికార్సుగా పోరాడుతున్న ప్రజాసంఘాల ఉద్యమ స్ఫూర్తి తో  రాయలసీమ సమాజం పాలకులపై ఒత్తిడి పెంచేలాగ చైతన్యవంతం కావాలి. సమగ్రాభివృద్ధి సాధనలో రాయలసీమ  సమాజం కూడా కీలకమైన పాత్ర వహించాలి.

రాయలసీమ అభివృద్ధి సాధనకు రాయలసీమ సమాజాన్ని చైతన్య వంతం చేస్తూనే, పాలకులపై ఒత్తిడి పెంచే దిశగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాయలసీమ విద్యావంతుల వేదిక కు మరొక్కసారి అభినందనలు. జై రాయలసీమ, జై జై రాయలసీమ.

(29.9. 2024 న ప్రొద్దుటూరులో జరిగిన రాయలసీమ విద్యావంతుల వేదిక నాలుగో రాష్ట్ర మహా సభల ప్రారంభోపన్యాసం )